AP Government : దేశ రక్షణలో ఉన్న సైనికుల విషయంలో ఏపీ ప్రభుత్వం( AP government) ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పంచాయితీల్లో నివాసం ఉండే సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. మాజీ సైనికులు, ప్రస్తుతం విధుల్లో ఉన్న డిఫెన్స్ సిబ్బంది లేదా వారి జీవిత భాగస్వాముల పేరు మీద ఇల్లు ఉంటే.. ఆస్తి పన్ను ఉండదు. ఈ నిర్ణయం సైనికులకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం. పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన రావడం విశేషం. గతంలో మాజీ సైనికులకు, విధుల్లో ఉండే ఆర్మీ సిబ్బందికి మాత్రమే ఈ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు విధుల్లో ఉన్న రక్షణ సిబ్బందికి కూడా ఈ సౌకర్యం కల్పించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది.
Also Read : అటువంటి వారికి 50% రాయితీ ఇస్తూ గుడ్ న్యూస్ తెలిపిన ప్రభుత్వం.. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి..
* ఆస్తి పన్ను ఉండదు..
కొత్తగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం మాజీ సైనికులు, ప్రస్తుతం విధుల్లో ఉన్న డిఫెన్స్ సిబ్బంది, వారి భార్య లేదా భర్త పేరు మీద ఇల్లు ఉంటే ఆస్తి పన్ను ఉండదు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సైనికుల సంక్షేమం కోసం రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. మాజీ సైనికులకు, ఆర్మీ సిబ్బందికి మాత్రమే ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల వస్తున్న సమస్యలను ఆ లేఖలో వివరించే ప్రయత్నం చేసింది. దీనిని పరిశీలించిన కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2003 నవంబర్ 10 న జారీచేసిన ఉత్తర్వులను సవరించింది. ఆర్మీ అనే పదం స్థానంలో డిఫెన్స్ అనే పదాన్ని చేర్చింది. దీని ద్వారా మాజీ సైనికులు లేదా విధుల్లో ఉన్న రక్షణ సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల్లో ఎవరికైనా ఒకరికే ఆస్తి పన్ను మినహాయింపు లభిస్తుంది, దంపతుల పేర్ల మీద రెండు ఇల్లు ఉంటే ఒకరికి మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఒక ఇల్లు ఎన్ని అంతస్తులు ఉన్నా.. దానికి ఒకటే డోర్ నెంబర్ ఉంటే పన్ను రాయితీ ఇస్తారు. ఆ ఇంట్లో రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉండాలి. అద్దెకు మాత్రం ఇవ్వకూడదు.
*ఇలా వర్తింపు..
ఒక పంచాయతీలో మొత్తం ఇళ్లలో 10% కంటే ఎక్కువ ఇల్లు రక్షణ సిబ్బందికి చెందినవి అయితే.. అలాంటి చోట్ల ఆస్తి పనులు 50 శాతం మాత్రమే మినహాయింపు ఇస్తారు. 10 శాతం కంటే తక్కువ ఇల్లు ఉంటే 100% మినహాయింపు వర్తిస్తుంది. అయితే ఈ నిర్ణయం పై సైనికులు, మాజీ సైనికుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. మరోవైపు దేశ రక్షణలో అమరుడైన ఏపీకి చెందిన జవాన్ మురళి నాయక్ కు సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. మురళి నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్ లను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. 25 ఏళ్ల వయసులో మాతృభూమి కోసం ప్రాణాలర్పించి అమరుడైన మురళి త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుంది.. మీ ఆవేదన తీర్చలేనిది.. అయినా ధైర్యంగా ఉండండి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు.
* ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్..
మరోవైపు ఏపీ ప్రజల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ లో( AP Bhavan) 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చారు. అధికారులు సిబ్బంది అందుబాటులో ఉంటారు. కొన్ని ప్రత్యేక ఫోన్ నెంబర్లతో సర్వీసులను అక్కడ ఏర్పాటు చేశారు. ఎటువంటి అత్యవసర సేవలైనా అక్కడ పొందవచ్చు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా భద్రతను పెంచారు. ముఖ్యంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Also Read : విదేశాల్లో యువతకు ఉద్యోగాలు.. నెలకు రూ.3 లక్షలు.. ఏపీ ప్రభుత్వం ఒప్పందం!*