AP Fake Liquor Case: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలపల్లి ప్రాంతంలో నకిలీ మద్యం వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం మొత్తానికి జై చంద్ర రెడ్డి కారణమని.. మీడియాలో వార్తలు వస్తున్నాయి. జై చంద్ర రెడ్డి ఏపీలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు టిడిపి టికెట్ దక్కించుకున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తంబళ్లపల్లె ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం వ్యవహారంలో చంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చంద్రారెడ్డి అనుచరుడు జనార్దన్ రావు నకిలీ మద్యం వ్యవహారంలో కీలక సూత్రధారి అని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. అయితే అనూహ్యంగా జనార్దన్ రావు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందులో నకిలీ మద్యం వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో చెప్పారు.
వైసీపీ కీలక నాయకుడు జోగి రమేష్ పేరు ను జనార్దన్ రావు బయట పెట్టడంతో కలకలం రేగింది. దీంతో నకిలీ మద్యం వ్యవహారంలో వైసీపీకి కీలకపాత్ర ఉందని ప్రచారం జరిగింది. ఎప్పుడైతే జోగి రమేష్ పేరు బయటికి వచ్చిందో అప్పుడే వైసిపి అలర్ట్ అయింది. తన పేరు వినిపించగానే తెరపైకి వచ్చిన జోగి రమేష్.. మద్యం వ్యవహారంలో సిబిఐ జోక్యం చేసుకోవాలని.. అసలు విషయాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. అటు వైసీపీని అడ్డంగా బుక్ చేయాలని భావించిన కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురైంది. ఇదే ఊపులో వైసిపి తంబళ్లపల్లి మద్యం వ్యవహారంలో టిడిపి నేతలకు కీలకపాత్ర ఉందని.. వారి వల్లే ఇదంతా జరుగుతోందని ఆరోపించడం మొదలుపెట్టింది. వాస్తవానికి ఏపీలో అక్రమ మద్యం వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జగన్ పరిపాలనలో సాగిందని ఇప్పటికి ప్రచారంలో ఉంది. అందుచేత వైసిపి చేస్తున్న ఆరోపణలు పెద్దగా పసలేకుండా ఉన్నాయి.
కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో జయచంద్ర రెడ్డి ని టిడిపి ఎందుకు కాపాడుతోంది? జనార్దన్ రావు వెలుగులోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోకుండా ఎందుకు నిశ్శబ్దంగా ఉంది.. అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. మద్యం వ్యవహారంలో వైసిపి ఆరోపిస్తున్నట్టుగా నకిలీది తయారైనప్పటికీ.. ఆ స్థాయిలో మాత్రం మార్కెట్లోకి రాలేదు. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియకుండా నకిలీ మద్యం అనేది భారీ స్థాయిలో తయారు కావడం దాదాపు అసాధ్యం. వైసిపి ఆరోపిస్తున్నట్టుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారు చేయడం లేదు. అక్కడ లేబుల్స్.. ఇతరత్రా మాత్రమే తయారు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం నిజం.. ఇక్కడ వైసిపి సుద్దపూస కాదు. అలాగని టిడిపి ముద్దాయి కూడా కాదు. ఈ వ్యవహారంలో అటు వైసిపికి.. టిడిపికి కీలకపాత్ర ఉంది. కాకపోతే దొంగ నువ్వంటే నువ్వు అనుకుంటూ రెండు పార్టీలు తమ మీడియా సంస్థల ద్వారా కథనాలను ప్రసారం చేసుకుంటూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.