Homeఆంధ్రప్రదేశ్‌YS Family: వైఎస్ కుటుంబంలో మహిళల జగడం!

YS Family: వైఎస్ కుటుంబంలో మహిళల జగడం!

YS Family: ఏపీ ఎన్నికల్లో వైయస్ కుటుంబం హాట్ టాపిక్. సీఎం జగన్ కుటుంబంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పీసీసీ పగ్గాలు అందుకున్న షర్మిల సోదరుడు జగన్ ను టార్గెట్ చేశారు. ఆయన పాలన వైఫల్యాలను ఎండగడుతున్నారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ రెడ్డిని జగనే కాపాడుతున్నారని ఆరోపిస్తున్నారు. వివేకాను చంపించిన అవినాష్ కు మద్దతిస్తారా? న్యాయం కోసం పోరాడుతున్న తన వైపు నిలబడతారా? అంటూ షర్మిల ప్రశ్నించేసరికి వైసిపి నేతల్లో వైబ్రేషన్స్ ప్రారంభమవుతున్నాయి. ఇది కచ్చితంగా తమకు నష్టం కలిగిస్తుందని ఆందోళన పడుతున్నాయి.దీంతో జగన్ తన ఆడపడుచులను నియంత్రించేందుకు.. తన కుటుంబంలోనే మహిళలను ప్రయోగిస్తున్నారు. దీంతో కుటుంబంలో చిచ్చు మరింత పెరుగుతోంది.

ఆ మధ్యన వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకునే యాత్ర అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. అందులో రాజశేఖర్ రెడ్డి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. మన ఇంటికి సాయం కోసం వచ్చే ఆడపిల్లతో రాజకీయం ఏంటి? అనే డైలాగు బహుళ ప్రాచుర్యం పొందింది. అయితే అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ఎన్నికల ప్రచారంలో కొంగుచాచి న్యాయం చేయండి అని ఓటర్లను అడుగుతుండడం ఆలోచింపచేస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్, షర్మిలల మేనత్త విమలారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. షర్మిల, సునీతలను తీవ్రంగా విమర్శించారు. అవినాష్ రెడ్డి అమాయకుడని వెనుకేసుకొచ్చారు. ఆయనపై నిందలు వేయవద్దని.. వైయస్ కుటుంబ పరువును బజారుకు ఈడ్చొద్దని సలహా ఇచ్చారు.

అయితే విమలా రెడ్డి సడన్ ఎంట్రీ వెనుక జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కడప జిల్లాలో షర్మిల, సునీత ప్రచారానికి ప్రజాస్పందన పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో విజయమ్మను ప్రయోగించాలని జగన్ చూశారు. కానీ ఆమె ముందుగానే పరిస్థితిని గమనించి అమెరికా వెళ్ళిపోయారు. అందుకే తన మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దించారు. ఇప్పటికే ఈమె క్రిస్టియన్ వర్గాన్ని వైసీపీలో కొనసాగించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. బ్రదర్ అనిల్ కుమార్ ద్వారా జరిగే నష్టాన్ని ముందే ఊహించిన జగన్.. విమలారెడ్డిని తెరపైకి తెచ్చారు. అందుకే ఇప్పుడు విమలారెడ్డి షర్మిలపై మాట్లాడుతున్నారు. అయితే షర్మిల ఎక్కడ వెనక్కి తగ్గలేదు. విమలా రెడ్డి తనయుడికి జగన్ కొన్ని కాంట్రాక్టులు ఇచ్చి ఆర్థికంగా బలపడేలా చేశాడని.. అందుకే తన మేనత్త జగన్ కు అనుకూలంగా మాట్లాడుతోందని ఆరోపించారు. వయసు మీద పడడం వల్ల, ఎండల వల్ల వివేక తనకు చేసిందంతా మరిచిపోయి తన మేనత్త ఇప్పుడు మరోలా మాట్లాడుతుందని షర్మిల ఎద్దేవా చేశారు. మొత్తానికైతే అయితే వైఎస్ కుటుంబంలో మహిళల మధ్య చూస్తున్న రచ్చ.. సగటు వైఎస్ అభిమానిని కలచివేస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular