AP Elections 2024: ఏపీలో పోలింగ్ సమయం సమీపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఈనెల 13న జరగనుంది. ఈనెల 11 వరకు ప్రచారానికి సమయం ఉంది. సరిగ్గా తొమ్మిది రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నట్టు ఉంది పరిస్థితి. వ్యూహ ప్రతి వ్యూహాల్లో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. అటు పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం తీవ్ర ప్రయత్నాలు
చేస్తున్నారు. ప్రజలను తమ వైపు తిప్పుకునే ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు శ్రమిస్తున్నాయి.
అయితే గతానికి భిన్నంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనలతో ప్రచార సందడి కనిపించడం లేదు. గతంలో ఎన్నికల ప్రచారం పార్టీ సానుభూతిపరుడు ఇంటిపై జెండాలు కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రచారం తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి.దీనికి తోడు ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఎండలు ముదురుతుండడంతో ఉదయం,సాయంత్రానికి ప్రచారం పరిమితం అవుతోంది. గతంలో మాదిరిగా సభలు, సమావేశాలకు పార్టీల శ్రేణులు పెద్దగా హాజరు కావడం లేదు. దీంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.వారికి ఏం చేయాలో పోవడం లేదు.
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ఖర్చు అవుతోంది. అభ్యర్థులకు భారంగా మారుతోంది. కులాలు, ప్రాంతాలవారీగా నేతలు ప్రచార పర్వంలో అడుగుపెడుతున్నారు. ఏకకాలంలో నాయకుల బృందాలు ప్రచారం సాగిస్తున్నాయి. అటు వాహన ఖర్చు కూడా పెరిగింది. ప్రతి ఒక్కరికి కార్లు, నాలుగు చక్రాల వాహనాలు సమకూర్చాల్సి వస్తోంది. ఇంటింటా ప్రచారం చేయాల్సి వస్తోంది. ప్రతి ఓటరుకు నేరుగా కలిసి ఓటును అభ్యర్థించాల్సి వస్తోంది. గతంలో లక్షలతో సరిపోయేదని.. ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సీనియర్లు అయితే గత ఎన్నికలను గుర్తుచేసుకొని.. తెగ బాధపడుతున్నారు. మరోవైపు ప్రచార శైలి కూడా మారింది. స్థానిక అంశాలు కంటే.. రాష్ట్రస్థాయి అంశాలకి ప్రచారంలో ప్రాధాన్యం దక్కుతోంది. ఇలా ఎలా చూసుకున్నా ఈ ఎన్నికలు ప్రత్యేకమే.