AP Elections 2024: ఎన్నికల్లో కీలక ఘట్టానికి నేటితో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారపర్వం ముగియనుంది. ఈనెల 13న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటితో ప్రచారం ముగించాల్సి ఉండటంతో.. మిగిలి ఉన్న ఈ తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు, అధినేతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా షెడ్యూల్ రూపొందించుకున్నారు.
సీఎం జగన్ ఈరోజు మూడు ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు పలనాడు జిల్లా చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొనున్నారు. అనంతరం ఏలూరు జిల్లా కైకలూరులో మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగే సభకు హాజరవుతారు. టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు రెండు సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు నంద్యాలలో జరిగే సభకు హాజరవుతారు. రాజ్ థియేటర్ సర్కిల్లో ఏర్పాటు చేసే ప్రజా గళం సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు చిత్తూరులో ఏర్పాటు చేసే ప్రజాగళం సభకు హాజరవుతారు. తరువాత అక్కడి నుంచి నేరుగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకొనున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన తర్వాత ఏపీలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. వైసిపి పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టాయి. వాటి మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. వైసీపీ అభ్యర్థులతో పోల్చితే కూటమి అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడ్డారు.దీంతో టీడీపీ కూటమి వెనుకబడిందన్న ప్రచారం జరిగింది.కానీ చంద్రబాబుతో పాటు పవన్ దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేశారు. మార్చి 27 నుంచి ప్రారంభమైన ప్రజా గళం సభలు.. నేటి సభలతో కలుపుకుంటే 90 కి చేరుకున్నాయి. అటు జగన్ సైతం దూకుడుగా ఉన్నారు. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అటు పవన్ సైతం జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు.. కూటమి పార్టీలకు మద్దతుగా ప్రచారం చేశారు. నెల రోజులుగా క్షణం తీరిక లేకుండా గడిపిన నేతలు.. ఈరోజుతో రిలాక్స్ కానున్నారు. ఈరోజు రేపు వ్యూహాలకు పదును పెట్టనున్నారు.