AP Elections 2024: ‘ఓటే’త్తున్నారు.. హైదరాబాద్- విజయవాడ రహదారి మామూలుగా లేదుగా

ఏపీలో కీలక జిల్లాల నుంచి హైదరాబాద్ కు వలసలు అధికం. ఉద్యోగ ఉపాధి రీత్యా హైదరాబాదులో స్థిరపడిన వారంతా ఓటు వేయడానికి బయలుదేరడంతో రోడ్లు రద్దీగా మారాయి.

Written By: Dharma, Updated On : May 12, 2024 10:36 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: పండుగ వచ్చిన ప్రతిసారి హైదరాబాదు నుంచి ఏపీకి జనాలు క్యూ కట్టడం సహజం. అయితే ఇప్పుడు పండుగను గుర్తు చేస్తూ ఏపీ సెటిలర్స్ తిరిగి స్వగ్రామాలకు వస్తున్నారు. ఓటు వేసేందుకు భాగ్యనగరం నుంచి బయలుదేరారు. దీంతో రహదారులు వాహనాలతో నిండిపోయాయి. టోల్ ప్లాజాల వద్ద వేలాది వాహనాలు బారులు తీరాయి. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి. రెండో శనివారం తో పాటు ఆదివారం కలిసి రావడంతో.. ఎక్కువమంది కుటుంబాలతో స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిలో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోవడం కనిపిస్తోంది.

ఏపీలో కీలక జిల్లాల నుంచి హైదరాబాద్ కు వలసలు అధికం. ఉద్యోగ ఉపాధి రీత్యా హైదరాబాదులో స్థిరపడిన వారంతా ఓటు వేయడానికి బయలుదేరడంతో రోడ్లు రద్దీగా మారాయి. టోల్ ప్లాజా చెల్లింపులకు వాహనాలు బారులు తీరడంతో ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వేలాది వాహనాలు కనిపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ శివారులలోని హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. శుక్రవారం రాత్రి నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది.

మరోవైపు దక్షిణ మధ్య రైల్వే 58 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కొన్ని రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసింది. దీంతో చాలామందికి ఉపశమనం కలిగింది. ఉద్యోగ ఉపాధి రీత్యా ఎక్కువమంది ఏపీ వాసులు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. అటు వివిధ కంపెనీల్లో పని చేసే వలస కూలీలు, భవన నిర్మాణ కార్మికులు సైతం అధికంగా ఉన్నారు. ఇటువంటి వారిని సొంత గ్రామాలకు తరలించేందుకు ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ బస్సులను అద్దెకు తీసుకుని వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. రాను పోను ఖర్చులను భరిస్తున్నారు. రేపు ఓటు వేసిన వెంటనే తిరిగి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. మొత్తానికైతే హైదరాబాద్- విజయవాడ రహదారి సంక్రాంతి సమయాన్ని తలపిస్తోంది.