AP Elections 2024: పెరిగిన పోలింగ్.. ఏపీలో ట్రెండ్ ఎవరి వైపంటే..

70 శాతం పోలింగ్ నమోదైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాయి. ఓటర్ మొగ్గు తమ వైపే ఉందని కూటమి.. ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని వైసిపి చెబుతోంది.

Written By: Dharma, Updated On : May 14, 2024 1:45 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: అక్కడక్కడా ఘర్షణలు.. దాడులు.. మినహాయిస్తే ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో పోలింగ్ తగ్గుతుందని అందరూ భావించారు. కానీ ఓటర్లు రెట్టించిన ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాగులు, వంకలు దాటి ఆదివాసులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం బస్సులు, రైళ్లు, విమానాల్లో వచ్చి ఓటు వేశారు.. ఎన్నికల సంఘం సక్రమంగా ఏర్పాట్లు చేయడంతో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలు కలిగింది. ఏపీలోని చాలా ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్ జరిగింది. మొత్తానికి 70 శాతానికి మించి పోలింగ్ నమోదవడంతో అటు ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

70 శాతం పోలింగ్ నమోదైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాయి. ఓటర్ మొగ్గు తమ వైపే ఉందని కూటమి.. ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని వైసిపి చెబుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్ నాడి ఎటువైపు మొగ్గిందో రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇక మీడియా సంస్థలంటే పార్టీల వారీగా విడిపోయాయి కాబట్టి.. కొన్ని కూటమి వైపు.. మరికొన్ని వైసీపీ వైపు ఉన్నాయి.. అంతిమంగా ఎవరు గెలుస్తారనేది జూన్ 4న తేలుతుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఉత్తరాంధ్ర జిల్లాలు ఈసారి టిడిపికి జై కొట్టాయని తెలుస్తోంది. అదేవిధంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు వైసీపీకి వైపే ఉన్నాయని సమాచారం. ఇక ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రజలు కూటమి వైపు ఆసక్తి ప్రదర్శించారని తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కాస్త వైసీపీ వైపు మొగ్గు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. తామే అధికారంలోకి వస్తామని ప్రకటించారు. పోలింగ్ మొత్తం ఏకపక్షంగా జరిగిందని.. ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తమ సేకరించిన సమాచారం సంతృప్తికరంగా వచ్చిందని.. చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తున్నామని వివరించారు.

మరో వైపు వైసీపీ నాయకులు కూడా తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్ రూమ్ లో ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ప్రజలు తమకు అనుకూలంగా ఓటు వేశారని.. కచ్చితంగా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు ప్రకటించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని.. ప్రభుత్వంపై నమ్మకం ఉండటం వల్ల వారు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వచ్చారని చెబుతున్నారు. కచ్చితంగా ఈసారి కూడా అధికారంలోకి వస్తామని వారు అంటున్నారు.

కొంతమంది చెబుతున్న దాని ప్రకారం కూటమికి 90 నుంచి 110 సీట్లు వస్తాయని తెలుస్తోంది. ఎంపీల విషయంలోనూ ఇదే జరుగుతుందని సమాచారం. ఇక ఇదే సమయంలో మరి కొంతమంది వైసీపీ 110 నుంచి 120 సీట్లు గెలుచుకుంటుందని.. 15 నుంచి 19 వరకు ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ.. అంతిమ ఫలితం కోసం జూన్ 4 దాకా ఎదురు చూడక తప్పదు.