AP DSC 2025 : ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీకి( DSC) సమయం దగ్గరపడుతోంది. జూన్ 6 నుంచి ఆన్లైన్లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏపీ డీఎస్సీ 2025 దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన పోస్టులకు 3,53,598 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే మొత్తంగా 5.67 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. అంటే ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించి వివరాలు, హాల్ టికెట్ల జారీ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండడంతో ఏపీ ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది.
* మెగా డీఎస్సీ ప్రకటన
తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ( Mega DSC) ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు సీఎం చంద్రబాబు. మొత్తం 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేశారు. మే 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. 30 నుంచి హాల్ టికెట్ల జారీ ప్రక్రియకు అనుమతి ఇచ్చారు. ప్రధానంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్స్ వంటి పోస్టులు ఈ డీఎస్సీలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం అని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి పోస్టులు అధికంగా ఉన్నాయి. కానీ అంతకుమించి పోటీ కూడా ఉంది. లక్షలాదిమంది ఉపాధ్యాయ కొలువుల కోసం అహోరాత్రులు శ్రమించారు. అయితే భారీగా పోస్టులు ప్రకటించడం పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఏపీ డీఎస్సీ.. దరఖాస్తు సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
* నెల రోజులపాటు పరీక్షలు..
నెల రోజులపాటు ఆన్లైన్లో ( online mode )డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 6 నుంచి జూలై ఆరు వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. విద్యాశాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రాల ఎంపిక దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. రోజుకు 40,000 మంది పరీక్షలు రాసే విధంగా ప్రణాళిక రూపొందించారు. ప్రతి సెషన్ కు 20వేల సిట్టింగ్ సామర్థ్యంతో.. రోజుకు రెండు సెషన్లలో 40,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాసే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఈనెల 30 నాటికి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నారు. అయితే ఈ నెలరోజుల డీఎస్సీ పరీక్షల సమయంలో ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయి. అందుకే వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.
* టెట్ పై సందిగ్ధత
అయితే ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్( Teacher Eligible Test) నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే టెట్ జరిగి ఆరు నెలలకు పైగా సమయం గడుస్తోంది. అయితే భారీగా ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ ప్రకటించడంతో పరీక్షల నిర్వహణ, హాల్ టికెట్లు విడుదల, సజావుగా పరీక్షలు జరిగేలా ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెడుతూ ఏర్పాట్లు చేస్తోంది. సమీప భవిష్యత్తులో ఈ టెట్ నిర్వహణకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.