Cyclone Montha : పెను విపత్తు నుంచి ఏపీ బయటపడింది. భారీ ప్రమాదం తప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండం గా మారింది. దాని తీవ్రత అధికంగా ఉన్న విషయాన్ని గుర్తించిన భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ పెను విపత్తుకు ‘మొంథా’ అని పేరు పెట్టారు. ఏపీ వైపు దూసుకు వస్తుందని తెలిసి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రజలను అప్రమత్తం చేయగలిగింది. ఏపీ తీరం వైపు దూసుకు వచ్చిన తుఫాన్ విధ్వంసం సృష్టించింది. కానీ ప్రభుత్వ ముందస్తు హెచ్చరికలతో మాత్రం పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే విషయం. ఇంతటి పెను విపత్తులో ఒకరు మృతి చెందగా.. 13 మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.
* ముందస్తు చర్యలతో..
గతంలో ఏపీకి( Andhra Pradesh) పెను విపత్తులు వచ్చాయి. విశాఖను హుద్ హుద్ దారుణంగా దెబ్బతీసింది. శ్రీకాకుళం జిల్లాను తితలీ కాక వికలం చేసింది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యగా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. ముంపు తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. తుఫాన్ తీరానికి తాకక ముందే సీఎం చంద్రబాబు పటిష్టమైన టీం ను ఏర్పాటు చేశారు. సచివాలయంలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 38 వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. దాదాపు రెండు వేలకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్డిఆర్ఎఫ్ తో పాటు ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేసాయి. మరోవైపు ఏపీలో ఉన్న వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సైతం అలర్ట్ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఆపగలిగారు.
* స్తంభించిన రవాణా వ్యవస్థ..
విజయవాడ( Vijayawada), విశాఖ, తిరుపతి నుంచి వెళ్లే రైళ్లను రద్దు చేశారు. విమాన సర్వీసులను నిలిపివేశారు. వరద ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ఆర్టీసీ సేవలను సైతం ఆపేశారు. ఇవన్నీ సత్ఫలితాలు నిచ్చాయి. అయితే రవాణా వ్యవస్థ స్తంభించడంతో దాదాపు 800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సాధారణంగా ఇంతటి విను విపత్తు సమయంలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం భారీగా జరుగుతుంది. కానీ ప్రభుత్వ ముందస్తు హెచ్చరికలతో ప్రజలు కూడా అప్రమత్తం అయ్యారు. ప్రభుత్వ సూచనలను పాటించారు. అయితే గతంలో విజయవాడలో బుడమేరు పొంగి ప్రవహించడంతోనే అష్టదిగ్బంధం అయింది. చాలామంది ప్రాణాలు కూడా వదిలారు. కానీ ఈ భారీ తుఫాన్ లో ప్రాణ నష్టం లేకుండా చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. సాధారణ అల్పపీడనం మాదిరిగానే పరిస్థితి ఉంది. పంటలకు సంబంధించి నష్ట నివేదిక తయారు చేసే పనిలో పడింది ప్రభుత్వం. మొత్తానికైతే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రభుత్వం సక్సెస్ కనిపిస్తోంది.