Homeఆంధ్రప్రదేశ్‌AP CS Jawahar Reddy: వైసిపి పై అసహనంతో ఏపీ సిఎస్.. కారణం అదే!

AP CS Jawahar Reddy: వైసిపి పై అసహనంతో ఏపీ సిఎస్.. కారణం అదే!

AP CS Jawahar Reddy: ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి ఒంటరి అయ్యారా? మరో నెల రోజుల్లో పదవి విరమణ పొందుతున్న ఆయన పై వస్తున్న ఆరోపణలు ఏంటి? కనీసం వాటిని వైసిపి పెద్దలు ఖండించడం లేదు ఎందుకు? దీని వెనుక జరుగుతున్న వ్యవహారం ఏంటి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా సి ఎస్ జవహర్ రెడ్డిని మార్చుతారని ప్రచారం జరిగింది. ఎన్నికలకు ముందే డిజిపి తో పాటు సిఎస్ ను మార్చాలని టిడిపి కోరిన సంగతి తెలిసిందే. కానీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని మాత్రమే ఎలక్షన్ కమిషన్ మార్చింది. సి ఎస్ జవహర్ రెడ్డి విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు అదే జవహర్ రెడ్డి చుట్టూ అవినీతి ఆరోపణలు రావడం.. దానిని వైసీపీ నేతలు ఖండించకపోవడం గమనార్హం.

విశాఖ జిల్లాలో దళితుల భూములను సిఎస్ జవహర్ రెడ్డి కుటుంబం కొల్లగొట్టింది అని జనసేన నుంచి ఆరోపణలు వచ్చాయి. విశాఖకు చెందిన ఆ పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై జవహర్ రెడ్డి నొచ్చుకున్నారు. మూర్తి యాదవ్ క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో విలువైన భూములను జవహర్ రెడ్డి కుటుంబం కారు చౌకగా కొట్టేసిందని టిడిపి నాయకులు ఆరోపించడం ప్రారంభించారు. దీంతో సిఎస్ జవహర్ రెడ్డి ఆత్మరక్షణలో పడిపోయారు. టిడిపి నేతల ఆరోపణల కంటే.. వైసీపీ నుంచి ఆశించిన స్థాయిలో సాయం దక్కకపోవడంతో ఆయన మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.

వాస్తవానికి జవహర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. తొలుత టీటీడీలోకి జగన్ జవహర్ రెడ్డిని తీసుకున్నారు. కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో జవహర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయనకు కీలక పదవి కట్టబెట్టారు జగన్. ఒకవైపు వైద్య ఆరోగ్యశాఖలో సేవలందిస్తూనే.. టీటీడీని మాత్రం విడిచిపెట్టలేదన్న విమర్శ జవహర్ రెడ్డి పై ఉండేది. అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంతోమంది సీనియర్లు బరిలో ఉండగా… జగన్ మాత్రం జవహర్ రెడ్డి ని ఎంపిక చేశారు. అస్మదీయ అధికారిగా జవహర్ రెడ్డి నిలిచారన్నది యంత్రాంగంలో ఉన్న ఆరోపణ. జగన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నా అడ్డు చెప్పలేని పరిస్థితి ఆయనది. గత కొద్ది రోజులుగా జగన్ సర్కార్కు అనుకూల నిర్ణయాలు తీసుకోవడంలో జవహర్ రెడ్డి ముందుండే వారన్నది ఆయన పై ఉన్న ఆరోపణ. చివరకు పోలింగ్ కు ముందు పింఛన్ల పంపిణీలో సైతం వైసీపీ సర్కార్ కు అనుకూలంగా పనిచేశారన్నది విపక్షాల నుంచి వచ్చిన ఆరోపణ. ఇప్పుడు అదే విపక్షాల నుంచి జవహర్ రెడ్డి పై వ్యక్తిగత ఆరోపణలు వస్తున్నా ఖండించలేని స్థితిలో వైసిపి ఉంది. దీంతో జవహర్ రెడ్డి సైతం బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తున్నా.. తిప్పి కొట్టడంలో మాత్రం వైసిపి నుంచి సహకారం అందకపోవడం ఆయనలో ఉన్న ఆవేదనకు కారణం అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular