AP Constable Recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగం( government employment) అంటేనే ఒక క్రేజ్. భవిష్యత్తుకు ఎంతో భరోసా ఉంటుందని నమ్మకం. మంచి జీతంతో పాటు పదవీ విరమణ తర్వాత కూడా ఎన్నో రకాల సౌలభ్యాలు ఉంటాయి. పెన్షన్ తో పాటు గ్రాడ్యుటీ వంటివి లభిస్తాయి. తనకి కాకుండా తన కుటుంబానికి సైతం ప్రభుత్వ ఉద్యోగం భరోసా కల్పిస్తుంది. అందుకే ఎక్కువమంది ప్రభుత్వ ఉద్యోగం వైపు మొగ్గు చూపుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం పెద్ద యుద్ధమే చేస్తారు. అయితే ఏపీలో తాజాగా ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహించిన కానిస్టేబుల్ పోస్టుల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు సైతం కొలువు దీరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఫలితాలు వచ్చాయి. నిన్ననే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఫలితాలను విడుదల చేశారు. 6,100 పోలీస్ కానిస్టేబుల్ నియామకాల కు సంబంధించి కొద్ది రోజుల కిందట ఎంపిక ప్రక్రియ జరిగింది. దానికి సంబంధించి పోలీస్ శాఖ నిన్ననే ఫలితాలను వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించారు.
Also Read: ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. ఎంపికైతే రూ.20 వేలు!
ఉన్నత చదువులు వారు పోటీ..
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కానిస్టేబుల్ పోస్టులకు( constable posts ) బీటెక్, ఎంటెక్, బీసీఏ లాంటి సాంకేతిక కోర్సులు చేసిన పట్టభద్రులు సైతం పోటీ పడడం గమనార్హం. ఈ పోస్టునకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే ఎంపికైన వారిలో 4051 మంది డిగ్రీ, అంతకుమించి చదివిన వారే. అంటే అభ్యర్థులలో 67.24% మంది విద్యాధికులే అన్నమాట. ఎంబీఏ, ఎం కామ్, ఎంఎస్సీ, ఎల్.ఎల్.బి, ఎంఏ లాంటి ఉన్నత విద్య చదివిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇక సాంకేతిక కోర్సులు బీటెక్, ఎంటెక్ చదివిన వారు 810 మంది ఉన్నారు. అంటే కానిస్టేబుల్ పోస్టు ఎంత గిరాకీ ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో విపరీతమైన ఒత్తిడి ఉన్న నేపథ్యంలో యువత ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే చిన్న ఉద్యోగం అయినా పోటీ పడుతున్నారు.
Also Read: విశాఖలో 53 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు!
తీరనున్న సిబ్బంది కొరత..
రాష్ట్రవ్యాప్తంగా 6000 పోస్టులు భర్తీ కానుండడంతో పోలీసు శాఖలో ( police department) సిబ్బంది కొరత తీరనుంది. తాను అధికారంలోకి వస్తే ఏటా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మాత్రం జాప్యం చేశారు. కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ ఎంపిక ప్రక్రియ మాత్రం పూర్తి చేయలేకపోయారు. దీంతో అభ్యర్థులు యాళ్ల తరబడి వేచి చూడడం కనిపించింది. అయితే చాలామంది వయస్సు దాటడంతో అటువంటి వారికి అవకాశం లేకుండా పోయింది. అందుకే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి దృష్టి పెట్టింది. న్యాయపరమైన చిక్కులను అధిగమించి.. భర్తీ ప్రక్రియను పూర్తి చేయగలిగింది. ఈ ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు శిక్షణ ఉండనుంది. తరువాత వారిని పోలీస్ స్టేషన్లో నియామకాలు చేయనున్నారు. అయితే గతంలో లేని విధంగా ఉన్నత చదువులు చదువుకున్న వారు సైతం కానిస్టేబుల్ పోస్ట్ కోసం పోటీ పడడం గమనార్హం.