Rushikonda buildings: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. కొన్ని రకాల నిర్ణయాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రధానంగా విశాఖలో రిషికొండ భవనాల విషయంలో ఎటు తేల్చుకోలేకపోతోంది ప్రభుత్వం. ఇప్పటికే వీటి వినియోగం విషయంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ భవనాలను నిర్వహణ అనేది ప్రభుత్వానికి భారంగా మారింది. ప్రభుత్వం తన వద్ద ఉంచుకొని అవసరాలకు వినియోగిస్తే నిర్వహణ ఖర్చు కూడా రాదు. అయితే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, హోటళ్ల యాజమాన్యాలు ఇప్పుడు ఈ భవనాల కోసం ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి.. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ భవనాల ద్వారా ఇప్పుడు ఆదాయం సమకూరే అవకాశం రావడంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వం రుషికొండలో భవనాలను నిర్మించింది. పర్యాటకశాఖ భవనాలు అని చెబుతున్న.. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసమే వీటిని నిర్మించారన్నది బహిరంగ రహస్యం. 2024 ఎన్నికల్లో జగన్ గెలిచి ఉంటే విశాఖ క్యాంప్ ఆఫీస్ నుంచి పాలన నడిచేది. అయితే వైసిపి ఓడిపోయిన తర్వాత ఈ భవనాలను ఎందుకు నిర్మించామో చెప్పలేదు. ఎలా వినియోగించుకోవాలో కూటమి ప్రభుత్వానికి తెలియలేదు. అయితే ప్రతి నెల ఈ భవనాల నిర్వహణకు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వీటి వల్ల ఆదాయం సమకూరకపోగా ఖర్చు ఎదురవుతుండడంతో ప్రభుత్వంలో చిన్నపాటి ఆందోళన ఉండేది. ఆపై అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్న వీటి వినియోగం విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టినట్లు సమాచారం.
నిర్ణయం అనివార్యం.. రుషికొండ( rushikonda ) అనేది విశాఖకు ల్యాండ్ మార్క్. నగరానికి ఒక గుర్తింపైన ప్రాంతం. నిత్యం పర్యాటకులతో కళకళలాడే ప్రదేశం. రిషి కొండపై పున్నమి రిసార్ట్స్ ఉండేవి. వీటి ద్వారా ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. అటువంటి రుషికొండను గుండు కొట్టించి వందల కోట్ల రూపాయలతో అధునాతనమైన భవనాలను నిర్మించారు. ఎందుకు నిర్మించారో చెప్పలేదు.. ఎలా వినియోగించుకోవాలో సూచించలేదు. అయితే మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ దీనిపై క్లారిటీ ఇచ్చేది. కానీ పర్యావరణ అనుమతులకు వ్యతిరేకంగా దీనిని నిర్మించారని అప్పట్లో టిడిపి కూటమి ఆరోపించింది. ఇప్పుడు కచ్చితంగా పర్యాటక రంగానికి సంబంధించి మాత్రమే వినియోగించేందుకు అవకాశం ఉంది. ఆతిధ్యరంగంలో దేశంలో ఉన్న ప్రముఖ హోటల్స్ యాజమాన్యాలు ఈ భవనాల కోసం ముందుకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు సైతం అధిక లీజుకు తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీని వినియోగంపై అధ్యయనానికి ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ ఒక నివేదిక సీఎం చంద్రబాబుకు ఇవ్వనుంది. దీనిపై సీఎం ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వీటి వినియోగం విషయంలో జాప్యం జరిగితే దాని ప్రభావం ప్రభుత్వం పై పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అనివార్యంగా మారింది.