Perni Nani: కొందరు నేతలకు ఆశలకు అంతు ఉండదు. పైకి ఒక మాట చెబుతారు కానీ.. లోపల ఇంకోలా ఉంటారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ మాజీమంత్రి పేర్ని నాని అదే ఆలోచనతో ఉన్నారు. గత ఎన్నికల నుంచి తప్పుకొని తన కుమారుడు కిట్టుకు అవకాశం ఇచ్చారు. తాను ఇక క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అయితే ఇప్పుడాయన మనసు మారినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ సీటు పై ఆయన దృష్టి పడినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేసేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన విషయంలో తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే గత ఎన్నికల్లో చాలామంది సీనియర్లు తమ కుమారులకు టికెట్లు అడిగారు. వారందరినీ కాదని పేర్ని నాని విషయంలో మినహాయింపు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ ఆలోచనతోనే అప్పటి మాదిరిగా ఇప్పటినుంచి ఒక ప్లాన్ తో ఉన్నట్లు అర్థమవుతుంది.
* కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం..
మచిలీపట్నం ( Machilipatnam) ఎంపీగా కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరి ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయన 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా మచిలీపట్నం ఎంపీ సీటును జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలశౌరి గెలిచారు. అయితే ఇప్పుడు అదే ఎంపీ సీట్ పై దృష్టిపెట్టారు పేర్ని నాని. ఆయన కుమారుడు కిట్టు మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారు. తాను మాత్రం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని సన్నిహితులు వద్ద చెబుతున్నారు పేర్ని నాని. దానికి ఆయన చెబుతున్న కారణం పార్టీలో తనకు మించి ఇంకా ఎవరు ఉన్నారు అనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. మచిలీపట్నం అంటే ఎవరు ముందుకు రారు అని.. తాను తప్పించి ఇంకెవరు గట్టి పోటీ ఇవ్వలేరని నాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధినేత తన మాట కాదనరని గట్టి నమ్మకంతో ఉన్నారు పేర్ని నాని. ఎవరు వచ్చినా తన ముందు నిలబడలేరని.. ఎందుకంటే తన చేతిలో మచిలీపట్నం అసెంబ్లీ సీటు ఉంటుందన్న విషయాన్ని గ్రహించుకోవాలని సూచిస్తున్నారట.
* ఆమె వైసీపీలోకి వస్తే..
మరోవైపు వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశా కిరణ్ వైసీపీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీ సీటును ఆమెకు ఇస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఆమె రాక పేర్ని నానికి ఇష్టం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు నాయకుడిగా పేర్ని నాని ప్రమోట్ అవుతున్నారు. వంగవీటి మోహన్ రంగ కుమార్తె వచ్చిన మరుక్షణం ఆమెను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇది ఎంత మాత్రం పేర్ని నానికి ఇష్టం లేదు. అందుకే తనకు టికెట్ కేటాయించాలని ఆయన కోరుతున్నారు. ఆ పై వంగవీటి మోహన్ రంగ కుమార్తెను వైసీపీలోకి రాకుండా అడ్డుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీలో నోరున్ననేతగా పేర్ని నానికి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు ఆయన. అందుకే ఎన్నికల వరకు ఆయనకే ఓకే చెబుతారని.. ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డి ఆ సీటు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే పేర్ని నాని గట్టి ప్లాన్ తో ఉన్నారు అన్నమాట.