AP Cabinet: ఉచిత గ్యాస్ పథకానికి అది తప్పనిసరి.. దీపావళికి సిలిండర్లు!

ఎన్నికల్లో ప్రజాకర్షక పథకాలకు హామీ ఇచ్చారు చంద్రబాబు. ప్రధానంగా మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 17, 2024 1:38 pm

AP Cabinet

Follow us on

AP Cabinet: చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు.ఒక్కొక్కటి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా మహిళలను టార్గెట్ చేసుకుని హామీలు ఇచ్చారు చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రకటించిన వాటిలో మహిళలకే అధికం. అందులో కీలకమైన పథకాలు పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కసరత్తు చేస్తున్నారు. దీపావళి నుంచి అమలు చేసేందుకు నిర్ణయించారు. మరో 15 రోజుల వ్యవధి ఉండడంతో దానిపై ఫోకస్ పెట్టారు. అమరావతి లోనే ఈ పథకం ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం త్వరలో విడుదల చేయమన్నారు. తాను అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని తన ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం చేర్చారు. సూపర్ సిక్స్ పథకాలలో సైతం ప్రకటించారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతున్న క్రమంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. మార్గదర్శకాలను రూపొందించే పనిలో యంత్రాంగం బిజీగా ఉంది.

* ఒక్కో కుటుంబానికి రూ.2500 ఆదా
సాధారణంగా నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఓ కుటుంబానికి నెలకు సగటున ఒక గ్యాస్ సిలిండర్ ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు వినియోగం ఉంటుంది. ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచితంగా సిలిండర్లు అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై రూపాయలు గా ఉంది. మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం వల్ల ఒక కుటుంబానికి ఏడాదికి 2500 రూపాయలు లబ్ధి చేకూరుతుంది.అయితే ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు సమాచారం. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

* త్వరలో మార్గదర్శకాలు
రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుల ప్రాతిపదికన తీసుకుంటే.. 1.47 కోట్ల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతోంది.అక్కడ పరిస్థితులను అధ్యయనం చేశారు అధికారులు. ఒక నివేదికను సైతం తయారు చేశారు. మంత్రుల కమిటీ కూడా దీనిపై కొన్ని సిఫారసులు చేసింది. ఇంకా సీఎం చంద్రబాబు ఆమోదించాల్సి ఉంది.సీఎం ఆమోదం పొందిన వెంటనే ఈ పథకం మార్గదర్శకాలు వెల్లడయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం వర్తించాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. లబ్ధిదారులు విధిగా డీలర్ వద్దకు వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి వేలిముద్రలు వేస్తే రెండు నిమిషాల్లో ఈ కేవైసీ పూర్తవుతుంది.