AP BJP: బిజెపి హై కమాండ్( BJP hi command ) ఏపీ పై ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో బలపడాలని చూస్తోంది. మొన్నటి ఎన్నికల్లో భాగంగా టిడిపి, జనసేనతో కలిసి పోటీ చేసింది. మూడు పార్లమెంట్ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. గతంలో లేని విధంగా ఓట్లు, సీట్లు పెంచుకుంది. అయితే ఇప్పటికీ కూడా ఒంటరిగా పోటీ చేసి సీట్లు తెచ్చుకునే పరిస్థితిలో లేదు బిజెపి. అందుకే పొత్తులో కొనసాగుతూనే బలం పెంచుకోవాలని భావిస్తోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో బలమైన నేతను ఎంపిక చేయాలని చూస్తోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి పదవీకాలం ముగిసింది. అందుకే ఆమె స్థానంలో బలమైన నేతను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాలని భావిస్తోంది బిజెపి హై కమాండ్.
Also Read: ఈరోజు నుంచి రికార్డు ఉష్ణోగ్రతలు.. ఏపీలో ఆ ప్రాంతాలకు బిగ్ అలెర్ట్!
* ఎక్కువకాలం కమ్మలకే..
అయితే ఇప్పటివరకు కాపులతో(kapu )పాటు కమ్మ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇచ్చారు. అందుకే ఈసారి ఇతర సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవాలని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. కంభంపాటి హరిబాబు చాలాకాలం పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తరువాత కన్నా లక్ష్మీనారాయణ వచ్చారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అటు తర్వాత సోము వీర్రాజు సుదీర్ఘకాలం అధ్యక్ష పదవి చేపట్టారు. ఆయన సైతం కాపు సామాజిక వర్గం నేత. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం రెండున్నర ఏళ్లకు పైగా ఆ పదవిలో ఉన్నారు. ఆమె కమ్మ సామాజిక వర్గం నేత.
* రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్..
అయితే ఇప్పటివరకు సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుంటే.. రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ దక్కలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress party ) పట్ల రెడ్డి సామాజిక వర్గం ఆసక్తిగా ఉండేది. కానీ 2024 ఎన్నికల్లో ఆ సామాజిక వర్గంలో చేంజ్ కనిపించింది. గతం మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అంత మక్కువ లేదు. అందుకే ఆ స్పేస్ ను భర్తీ చేయాలని బిజెపి చూస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కానీ.. విష్ణువర్ధన్ రెడ్డి కి కానీ అధ్యక్ష పదవి అప్పగించాలని చూస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి అయితే రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించగలరని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
* ఆశిస్తున్న బీసీ సామాజిక వర్గాలు..
మరోవైపు బీసీ సామాజిక వర్గాలు కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్ష ( AP BJP Chief ) పదవిని ఆశిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకులు ఆ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. ప్రముఖంగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంకోవైపు కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి సైతం రేసులో ఉన్నట్లు సమాచారం. అర్థబలం, అంగ బలంతో బిజెపి విజయవంతంగా నడిపించగలరని సుజనా చౌదరి పై నమ్మకం. అయితే సామాజిక వర్గాల సమీకరణ పరిగణలోకి తీసుకుంటే మాత్రం సుజనాకు చాన్స్ లేనట్టే. అయితే వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెంచుకోవాలంటే మాత్రం సమర్ధుడైన నేత అవసరం. రెడ్డి సామాజిక వర్గం అయితే కిరణ్ కుమార్ రెడ్డి.. కమ్మ సామాజిక వర్గం అయితే సుజనా చౌదరి.. బీసీల నుంచి పరిగణలోకి తీసుకుంటే పివిఎన్ మాధవ్ పేరు ఖరారు చేసే అవకాశం ఉంది.