AP BJP
AP BJP: ఏపీ విషయంలో బిజెపి అంతరంగం అంతు పట్టడం లేదు. అసలు బిజెపి కూటమిలోకి వస్తుందా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ విషయంలో రాష్ట్ర బిజెపి నాయకులకు సైతం క్లారిటీ లేదు. వారు సైతం హై కమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు దాదాపు 500 మంది పేర్లను హై కమాండ్ కు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే 175అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులు బరిలో దిగితే.. ఒక్క చోటైనా డిపాజిట్లు దక్కే ఛాన్స్ ఉందా?అంటే మాత్రం బిజెపి నేతల నుంచి మౌనమే సమాధానమవుతోంది.
బిజెపిలో మెజారిటీ నాయకులు పొత్తును కోరుకుంటున్నారు. అప్పుడే ఒకటి రెండు సీట్లు దక్కించుకోవచ్చు అని భావిస్తున్నారు. కానీ బిజెపి హై కమాండ్ ఏ విషయం తేల్చడం లేదు. దీంతో ఏపీ బీజేపీ నేతలు డీలా పడుతున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కానుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఏపీ విషయంలో బిజెపి హై కమాండ్ ఎటూ తేల్చడం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో బిజెపి సర్దుబాట్లు చేసుకుంది. ఏపీ విషయంలో మాత్రం ఎడతెగని జాప్యం చేస్తోంది.
అసలు ఏపీలో బిజెపి ఒంటరి పోరు చేస్తే గౌరవం దక్కే ఛాన్స్ లేదు. ఆ ఆలోచన ఉంటే బిజెపి హైకమాండ్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించేది. పొరుగున తెలంగాణలో ఎన్నికల ప్రచార సభలో ప్రారంభమయ్యాయి. ఏపీలో మాత్రం కనీస కార్యాచరణ లేదు. అటు తెలంగాణలో నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. ఏపీలో మాత్రం ఒక్కరి పేరు కూడా ప్రకటించలేదు. ఈ లెక్కన పొత్తులకు ఒక రకమైన సంకేతం వచ్చినట్టు అయ్యింది. అసలు బిజెపి హై కమాండ్ మదిలో ఏముంది అనేది రాష్ట్ర నాయకులకు తెలియడం లేదు. అందుకే వారు ఎన్నికల సన్నాహాలు ప్రారంభించడం లేదు. చివరికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ సైతం యాక్టివ్ గా పని చేయడం ప్రారంభించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అమరావతి రాజధాని కి మద్దతుగా జరిగే సభలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరుకానున్నారు. కానీ బిజెపి పరంగా ఎటువంటి సభలు, కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. దీంతో బిజెపి రాష్ట్ర నాయకుల్లో ఒక రకమైన గందరగోళం నెలకొంది.