AP BJP chief Purandeshwari : ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మార్పు ఖాయమా? ఆమెను మార్చుతారా? అక్టోబర్ లో ఉద్వాసన పలకనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.తెలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించేందుకు బిజెపి హై కమాండ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలైలో పురందేశ్వరి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అప్పట్లో టిడిపి, బిజెపి దూరంగా ఉండేవి. చంద్రబాబుకు చెక్ చెప్పేందుకు పురందేశ్వరిని నియమించారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ఆమె ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేశారు. నాటి సీఎం జగన్ పై విమర్శలు చేసేవారు. టిడిపి పై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. ఒక విధంగా చెప్పాలంటే బిజెపి హై కమాండ్ ను పొత్తుకు ఒప్పించారు ఆమె. అధ్యక్ష స్థానంలో ఆమె కాకుండా ఇతరులు ఎవరు ఉన్నా టిడిపి తో బిజెపి పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నకామెంట్స్ కూడా వినిపించాయి. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవీ కాలం రెండేళ్లు. ఇంకా తొమ్మిది నెలల వ్యవధి ఉంది. అయితే పురందేశ్వరిని మార్చాలన్న డిమాండ్ ఏపీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెపై రాష్ట్ర బిజెపి సీనియర్లు చాలామంది ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.
* బిజెపిలో వర్గాలు కామన్
బిజెపిలో వర్గ విభేదాలు సర్వసాధారణం. ఏపీలో ఆ పార్టీ అభివృద్ధి కాకపోవడానికి అదే కారణం. ఎన్నికల్లో పొత్తులో భాగంగా 8 అసెంబ్లీ సీట్లను సొంతం చేసుకుంది బిజెపి. ఆరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి మూడింట గెలిచింది. అయితే ఏపీలో పొత్తు పెట్టుకుంటే కానీ బిజెపి గెలుచుకునే ఛాన్స్ లేదు. ఒంటరిగా పోటీ చేసి ఇప్పటివరకు గెలిచిన దాఖలాలు లేవు. గత ఐదేళ్ల కాలంలో బిజెపిలో మూడు వర్గాలు కొనసాగాయి. కొందరు బిజెపి నేతలు టిడిపికి సపోర్ట్ చేశారు. మరికొందరు వైసీపీకి మద్దతుగా నిలిచారు. అయితే పాత తరం నాయకులు మాత్రం న్యూట్రల్ గా ఉన్నారు. అయితే ఎన్నికల్లో బిజెపికి పొత్తు కుదరడంతో.. వైసీపీకి మద్దతుగా నిలిచే నేతలకు టికెట్లు దక్కలేదు. దీంతో వారిలో అసంతృప్తి ఉంది. వారంతా పురందేశ్వరి తీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
* ఫిర్యాదుల వెల్లువ
టిడిపి ప్రయోజనాల కోసమే పురందేశ్వరి పెద్దపీట వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ఆమె రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే టిడిపి నుంచి బిజెపిలో చేరిన వారికి మాత్రమే టికెట్లు దక్కాయి. వైసిపి మద్దతుదారులుగా ఉన్న నేతలకు కనీస స్థాయిలో కూడా టికెట్లు కేటాయించలేదు. వారికి నామినేటెడ్ పదవుల విషయంలో సైతం మొండి చేయి ఎదురవుతున్నట్లు సమాచారం. పార్టీలో తాము సీనియర్లమని.. తమను ఉద్దేశపూర్వకంగా తొక్కేసారని వారంతా హై కమాండ్ వద్ద ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పురందేశ్వరి సొంత సామాజిక వర్గానికి తప్ప.. మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి నామినేటెడ్ పదవుల్లో కూడా సొంత సామాజిక వర్గానికి చెందిన లంక దినకర్ కు మాత్రమే పదవి ఇప్పించుకున్నారని.. మిగతా వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పురందేశ్వరి పై ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది.
* కిరణ్ వైపు మొగ్గు
బిజెపి రాష్ట్ర పగ్గాలు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగిస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. సమర్థమైన నేతగా గుర్తింపు పొందారు. అయితే రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావం వంటి కారణాలతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయింది. ఆ పార్టీతో విభేదించిన కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఆదరణ లేకపోయేసరికి కొద్ది రోజులు సైలెంట్ అయిపోయారు. అనంతరం కాంగ్రెస్ గూటికి చేరారు. కానీ కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్నారు. తిరిగి బిజెపిలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే రాయలసీమలో పార్టీ బలపడవచ్చని.. రెడ్డి సామాజిక వర్గం బిజెపి వైపు వచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి. అందుకే బిజెపి హై కమాండ్ కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అక్టోబర్లో ఆయన నియామకం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More