AP BJP Chief : బిజెపి అగ్రనాయకత్వం( BJP hi command ) తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో పాటు ఏపీలో బలం పెంచుకునేందుకు వ్యూహం పన్నుతోంది. ఏపీ కంటే తెలంగాణలో ముందుగా ఎన్నికలు రానున్న తరుణంలో అక్కడ బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరోవైపు ఏపీలో కూటమి నేపథ్యంలో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చూస్తోంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు వివిధ రాష్ట్రాల అధ్యక్షులను మార్చాలని బిజెపి డిసైడ్ అయ్యింది. అందుకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో సైతం మార్పులు చేయాలని భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం బిజెపి సంస్థాగత నిర్మాణం ప్రారంభమైంది. ఏపీకి సంబంధించి 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఇప్పుడు అతి త్వరలో రాష్ట్ర అధ్యక్షులను సైతం ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
* ముగియనున్న పదవీకాలం
2023 జూలైలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి( Daggubati Purandeshwari ) నియమితులయ్యారు. ఆమె పదవి కాలం ఈ జూలైతో ముగియనుంది. అంతకుముందే ఏపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులను నియమించాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో బిజెపి ఎనిమిది అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో కనీసం బోణి కొట్టలేదు. కనీస స్థాయిలో కూడా ఓట్లు రాలేదు. దీంతో కేంద్రంలో ఉన్న బిజెపి ఏపీలో మనుగడ లేకుండా సాగింది. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పొత్తుల ద్వారా లబ్ధి పొందింది. అయితే పొత్తులు కుదర్చడంలో పురందేశ్వరి సక్సెస్ అయ్యారు. అందుకే మరి కొంతకాలం పాటు ఆమెను కొనసాగించే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పటికే ఆమె రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. త్వరలో విస్తరణలో ఆమెకు కేంద్రమంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే ఆమె కొనసాగింపు అనేది లేనట్టే.
* సుజనా కే ఛాన్స్
అయితే ఏపీ బీజేపీలో( AP BJP) చాలామంది ఆశావహులు ఉన్నారు. ప్రధానంగా అందులో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో చాన్స్ దొరుకుతుందని అంత భావించారు. కానీ బిజెపి నుంచి సత్య కుమార్ యాదవ్ కు ఛాన్స్ దక్కింది. దీంతో కేంద్రమంత్రిగా చేసిన సుజనా చౌదరి దానిని అవమానంగా భావిస్తున్నారు. అనవసరంగా ఎమ్మెల్యేగా పోటీ చేశానని బాధపడుతున్నారు. కనీసం బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తేనే సముచితంగా ఉంటుందని ఆశిస్తున్నారు. అందుకే ఈసారి సుజనా చౌదరి కి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
* భారీగా ఆశావహులు
ఇంకోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి పేరు సైతం తెరపైకి వచ్చింది. ఇంకోవైపు బిజెపి సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి పేరు సైతం బయటకు వచ్చింది. ఆయన విషయంలో కర్ణాటక, తెలంగాణకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కూటమిలో టిక్కెట్లు దక్కని వారికి అధ్యక్ష పదవి విషయంలో చాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ సహా ఇంచార్జ్ శివప్రకాష్ పార్టీ ముఖ్య లతో చర్చించారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఏపీలో కూటమి ఉన్న నేపథ్యంలో వారితో సమన్వయం చేసుకున్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.