AP Assembly Winter Session: చట్టసభల్లో బలమైన వాణిని వినిపించేందుకు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. అంటే శాసనసభ, శాసనమండలి అన్నమాట. అయితే ఏపీలో మాత్రం చట్టసభల్లో సీరియస్ నెస్ లేదు. రకరకాల కారణాలు చెప్పి సభ్యులు సభకు హాజరు కావడం లేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో శాసనసభకు రామని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ప్రతిపక్షం ఉంటేనే శాసనసభకు ఒక ప్రత్యేకత వస్తుంది. అక్కడ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రజాభిప్రాయం కూడా ప్రతిపక్షం ద్వారా వ్యక్తం అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో ప్రతిపక్షం అంటూ లేకుండా పోయింది. కేవలం 11 అసెంబ్లీ సీట్లు రావడంతో టెక్నికల్ గా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. రాజకీయ ఉద్దేశ్యంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. అయితే గతంలో ఇదే టెక్నికల్ ఇష్యూపై మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయనే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు దానిని అధిగమించి.
* అన్ని రాష్ట్రాల్లో ముగింపు..
అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి. పొరుగున దాయాది రాష్ట్రమైన తెలంగాణలో సైతం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం సమావేశాలు జరగలేదు. సాధారణంగా నవంబర్ నుంచి జనవరి వరకు ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. కానీ ఎందుకో ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. జనవరి రెండో వారంలో సమావేశాలు ఉంటాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. స్పీకర్ నుంచి కానీ.. డిప్యూటీ స్పీకర్ నుంచి కానీ ఎటువంటి స్పష్టత లేదు. ఈనెల 18 వరకు ఎలాగూ సంక్రాంతి సెలవులు కొనసాగుతాయి. సమావేశాలు పెట్టడం కుదరదు కూడా. అయితే 25 లోగా సమావేశాలు నిర్వహిస్తారని… ఐదు నుంచి ఆరు రోజులు కొనసాగిస్తారని తెలుస్తోంది.
* గొప్ప గౌరవభావం
గతంలో శాసనసభ అంటే ఒక గౌరవభావంతో చూసేవారు. ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు శాసనసభ సమావేశాలు జరిగేవి. వేసవి కాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, చివరిసారిగా శీతాకాల సమావేశాలు జరిపేవారు. అత్యవసర తీర్మానాల కోసం… అత్యవసర సమావేశాలు కూడా నిర్వహించేవారు. కానీ ఎప్పుడైతే అసెంబ్లీకి ప్రతిపక్షం బహిష్కరిస్తుందో.. ఆ సీరియస్ నెస్ తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు కూడా వైసిపి బహిష్కరించడంతో శాసనసభకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోతోంది. అందుకే సీఎం చంద్రబాబు సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. అయితే ప్రతిపక్షం లేనిదే శాసనసభకు అంత హుందాతనం రాదు. బహుశా ఆ కారణంతోనే శాసనసభ సమావేశాల విషయంలో సరైన నిర్ణయాలు రాలేదని తెలుస్తోంది.