Ayyannapatrudu Comments On Gouthu Latchanna: సర్దార్ గౌతు లచ్చన్న( Sardar Gouthu lachana) .. ఉద్యమాల నిప్పు కణిక. కార్మిక, కర్షకుల గురించి పోరాటం చేసిన మహానాయకుడు. స్వాతంత్ర ఉద్యమంలో పనిచేశారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఉమ్మడి ఏపీ ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేశారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఈ క్రమంలో ఆయన వహించిన పాత్ర ఎనలేనిది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, రాష్ట్ర ప్రతిపక్ష నేతగా విలక్షణ పాత్ర పోషించారు సర్దార్ గౌతు లచ్చన్న. దేశంలో ఇద్దరే సర్దార్లు ఉండగా.. ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకొకరు సర్దార్ గౌతు లచ్చన్న. అయితే ఆయన ఔన్నత్యాన్ని తాజాగా ఏపీ శాసనసభలో ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఏపీలో ప్రతిపక్ష హోదా గురించి పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. అప్పట్లో గౌతు లచ్చన్న తృణప్రాయంగా ప్రతిపక్ష హోదాను వదులుకున్న విషయాన్ని గుర్తు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఆయన మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను చూపిస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* రాజకీయాల్లో తనదైన ముద్ర..
శ్రీకాకుళం( Srikakulam) జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సర్దార్ గౌతు లచ్చన్న. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు సర్దార్ అనే బిరుదు దక్కించుకున్నారు లచ్చన్న. 1952 నుంచి 1983 వరకు సోంపేట నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో.. రెండుసార్లు తప్పించి.. మిగతా అన్నిసార్లు లచ్చన్న ఎమ్మెల్యేగా గెలిచారు. ఓసారి ఎంపీగా గెలిచి తన గురువు రంగా కోసం పదవిని వదులుకున్నారు. 1978లో జనతా పార్టీ తరఫున ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్నారు. ఈ క్రమంలో అప్పటి జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రతిపక్ష హోదాకు తగ్గ సంఖ్యాబలం జనతా పార్టీకి తగ్గింది. కానీ ప్రతిపక్ష నేత హోదా నుంచి లచ్చన్నను తప్పించలేదు. అంతలా గౌరవించింది అప్పటి ప్రభుత్వం. కానీ గౌతు లచ్చన్న మాత్రం తనంతట తాను ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేసి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. అదే విషయాన్ని తాజాగా ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
* పదవిని తృణప్రాయంగా వదులుకొని
తనకు ప్రతిపక్ష నేత పదవి ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) తేల్చి చెబుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన న్యాయ పోరాటానికి కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నాడు గౌతు లచ్చన్న వదులుకున్న పదవి గురించి ప్రస్తావించారు. తన తాత కూడా గౌతు లచ్చన్న శిష్యుడు అంటూ నిండు సభలో చెప్పుకొచ్చారు. ఆయన శిష్యరికంలోనే తన తండ్రి సైతం ఎమ్మెల్యే పదవులు చేపట్టారని తెలిపారు. అటువంటి మహానీయుడు మనుమరాలు గౌతు శిరీష అంటూ పలాస శాసన సభ్యురాలును సభలో మిగతా వారికి చూపించారు. లచ్చన్నలాంటి ఔన్నత్యం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు అయ్యన్నపాత్రుడు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* కుమారుడు, మనవరాలు సైతం..
సర్దార్ గౌతు లచ్చన్న వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన కుమారుడు, మాజీ మంత్రి శివాజీ( Sivaji). 1985 నుంచి 2004 వరకు సోంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. సోంపేట కనుమరుగై పలాస నియోజకవర్గం తెరపైకి వచ్చింది. 2014లో పలాస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. 2024 ఎన్నికల్లో ఆయన కుమార్తె గౌతు శిరీష ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తనదైన వాగ్దాటితో తాతకు తగ్గ మనవరాలుగా.. తండ్రికి తగ్గ తనయగా శభాష్ అనిపించుకున్నారు. పలాస నియోజకవర్గంలో అభివృద్ధి మార్క్ చూపిస్తున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను రాష్ట్ర వేడుకగా ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సర్దార్ గౌతు లచ్చన్న ఔన్నత్యాన్ని చాటి చెప్పడం విశేషం.
