AP Assembly Session: ఎట్టకేలకు పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరగగా.. జూన్ లో ఫలితాలు వచ్చాయి. అదే నెలలో ప్రభుత్వం కొలువుదీరింది. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే వైసిపి ఇంతకు ముందు పెట్టిన ఓటాన్ బడ్జెట్ జూలైతో ముగిసింది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. అదే ఓటాన్ బడ్జెట్ ను కొనసాగించింది. అయితే ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, సంక్షేమ పథకాలకు ఖర్చు వంటివి అధ్యయనం చేసిన తరువాత.. ఒక అంచనాకు వచ్చాక.. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఓటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 22 వరకు కొనసాగన ఉన్నాయి. సోమవారం ఉదయం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024- 25 ఏడాదికి గాను ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందే ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్టు సహా పలు కీలకమైన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
* వైసిపి ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్
ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అందుకే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం నాలుగు నెలలకు గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరో నాలుగు నెలలకు గాను ఓటాన్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. వచ్చే నాలుగు నెలలకు గాను పూర్తిస్థాయిలో బడ్జెట్ ఉంటుంది.
* వేర్వేరుగా బడ్జెట్లను ప్రవేశపెట్టనున్న మంత్రులు
శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఇక వ్యవసాయ బడ్జెట్ ని మంత్రి అచ్చెనాయుడు ప్రవేశపెట్టనున్నారు. అటు మండలిలో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. ఉదయం 9 గంటలకు బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ వాయిదా తర్వాత సభాపతి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. గత వైసిపి ప్రభుత్వంలో తీసుకొచ్చిన చాలా రకాల బిల్లును రద్దు చేస్తూ అసెంబ్లీలో తాజాగా బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సమావేశాలకు వైసిపి గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.