Homeఆంధ్రప్రదేశ్‌Pithapuram: అటు వర్మ,ఇటు వంగా గీత.. మధ్యలో పవన్.. గెలుపెవరిది?

Pithapuram: అటు వర్మ,ఇటు వంగా గీత.. మధ్యలో పవన్.. గెలుపెవరిది?

Pithapuram: ఏపీలో ఇతర రాజకీయ పార్టీల అధినేతల కంటే పవన్ భిన్న వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఆయనకు ఒక ఫిక్స్ నియోజకవర్గం అంటూ లేదు. జగన్ కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం, బాలకృష్ణకు హిందూపురం నియోజకవర్గాలు ఫిక్స్ గా ఉంటాయి. కానీ పవన్ విషయంలో అలా కాదు. గత ఎన్నికల్లో ఆయన గాజువాకతో పాటు భీమవరంలో పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. గత నాలుగు సంవత్సరాలుగా ఏ నియోజకవర్గమంటూ ఖరారు చేయలేదు. ఇప్పుడు ఎన్నికల ముంగిట పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. కాపుల ఓట్లు అధికంగా ఉండడం, టిడిపి, బిజెపితో పొత్తు ఉండడంతో తప్పకుండా గెలుపొందుతారని అంతా భావిస్తున్నారు. కానీ అక్కడ గెలుపు అంత సులువు కాదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ నిజాలను ఎల్లో మీడియా తొక్కి పెడుతోంది. సోషల్ మీడియా ద్వారా కొన్ని నిజాలు బయట పడుతున్నాయి. పవన్ మేల్కొనకుంటే మాత్రం పిఠాపురంలో ముప్పు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడించడానికి వైసిపి పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఇది జగమెరిగిన సత్యం కూడా. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇప్పటికే వైసీపీ రీజనల్ ఇన్చార్జి మిథున్ రెడ్డి పిఠాపురం పై దృష్టి పెట్టారు. ముద్రగడ పద్మనాభంను వైసీపీలో చేర్పించారు. పంచాయతీల వారీగా లెక్క కడుతున్నారు. టిడిపి, జనసేన అసంతృప్తులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా తాయిలాలు సైతం ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అన్నింటికీ మించి ఇక్కడ వంగా గీత బరిలో ఉండడం సైతం జాగ్రత్త పడాల్సిన విషయం.

వంగా గీతాది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఇదే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. అటు తరువాత రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచారు. పైగా పిఠాపురం నియోజకవర్గంలో విస్తృత బంధుగణం ఉంది. అన్ని పార్టీల్లో సన్నిహితులు ఉన్నారు. ఆమె వేగంగా ప్రజలతో మమేకం కాగలరు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా ఆమెను తెరపైకి తెచ్చారు. అటు ముద్రగడను తెప్పించి ఆమెకు సహాయకారిగా ఉంచారు.

అయితే వీటన్నింటికీ మించి టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ రూపంలో మరో ప్రమాదం పవన్ కు పొంచి ఉంది. ఈ నియోజకవర్గ టిక్కెట్ పై వర్మ ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు షాక్ ఇచ్చారు. జనసేనకు నియోజకవర్గాన్ని కేటాయించారు. పవన్ కళ్యాణ్ సైతం ఏకపక్షంగా తాను పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో వర్మ అనుచరులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. వర్మ సైతం తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత సమావేశం ఏర్పాటు చేశారు. పిఠాపురంలో స్థానికేతురులకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. తద్వారా పవన్ కు సపోర్ట్ చేయడం లేదని తేల్చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని హింట్ ఇచ్చారు. 2014లో టిడిపి టికెట్ నిరాకరించడంతో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తానని సంకేతాలు ఇస్తున్నారు. ఒకవైపు వంగా గీత, మరోవైపు వర్మ ఇండిపెండెంట్గా బరిలో దిగితే పవన్ కు కష్టమేనని తెలుస్తోంది. మరి పవన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version