AP Assembly Election Results 2024: జగన్ ఓడిపోయాడు. గత ఎన్నికల్లో ఇదే సమయానికి 151 సీట్లు ఇచ్చిన ఏపీ ప్రజలు.. ఈసారి కి ఫోఫోవోయ్ అంటూ తీర్పు ఇచ్చారు. కర్రు కాల్చి వాతపెట్టారు. వాస్తవానికి ఏపీ ప్రజలు పంచుడు పథకాలను ఆలింగనం చేసుకోలేదు. వారి మదిలో ఎన్నో ఉన్నాయి.. గుంబనంగా ఉన్నారు. తీరా బ్రహ్మాండం బద్దలైపోయే స్థాయిలో తీర్పు ఇచ్చారు. జగన్ ఎందుకు ఓడాడు, చంద్రబాబు ఎందుకు గెలిచాడు అనే విశ్లేషణలు కాస్త పక్కన పెడితే.. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా ఏపీలో కొన్ని మీడియా ఓనర్ల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించాలి. ఇందులో కచ్చితంగా ఈనాడు రామోజీరావు ఉంటాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉంటాడు..
జగన్ కూడా పదేపదే చెప్పాడు కదా.. తనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయ శత్రువులు కానేకారని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మాత్రమే అని. వారు చేసిన వ్యతిరేక ప్రచారమో.. తన పరిపాలన వైఫల్యమో.. మొత్తానికి జగన్ దారుణంగా ఓడిపోయాడు. ఊహించని స్థాయిలో మట్టికరిచాడు.. ఇంతలా ఓడిపోతానని జగన్ కూడా ఊహించి ఉండడు. ముందుగా చెప్పినట్టు ఈసారి ఏపీ ఎన్నికల్లో తెలుగు మీడియా పోషించిన పాత్ర మామూలుది కాదు. చాలామంది ఈ సోషల్ మీడియా కాలంలో మీడియా రాతల్ని ఎవరు నమ్ముతారు? బలమైన మీడియా వ్యవస్థ ఉన్న టిడిపిని వైయస్ రాజశేఖర్ రెడ్డి ఓడించలేదా? గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కిందికి దించలేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం కావచ్చు. కానీ, అప్పటి ఎన్నికల్లో మీడియా కాస్తో కూస్తో దాని లాగే ఉంది. కానీ ఈసారి లీటర్ల కొద్దీ విషం చిమ్మింది. టన్నులకొద్దీ పైత్యాన్ని ప్రదర్శించింది. వాస్తవానికి టిడిపి అనుకూల మీడియా ఈ స్థాయిలో విజృంభించడం బహుశా ఇదే తొలిసారి.
రామోజీరావును ఇబ్బంది పెట్టాడు. జైలుకు పంపించాలని చూశాడు. కెసిఆర్ అడ్డుపుల్ల వేశాడు కాబట్టి సరిపోయింది.. లేకుంటే కథ వేరే విధంగా ఉండేది.. చరమాంకంలో తట్టుకునేవాడు కాదు. ఇక్కడితోనే జగన్ ఆగలేదు.. ఈనాడుకు ప్రధాన ఆర్థిక మూలమైన మార్గదర్శి కూసాలు కదిలించాడు. సుప్రీంకోర్టులో నవ్వుల పాలు చేశాడు. “లార్జెస్ట్ సర్క్యులేషన్ ఇన్ తెలుగు స్టేట్స్” కు ప్రకటనలు ఇవ్వకుండా (మేనేజ్మెంటే వద్దన్నదని చెబుతుంటారు) పక్కన పెట్టాడు. పైగా పోలవరం నిర్మాణంలో నవయుగను బయటికి పంపించాడు.. దీంతో ఈనాడుకు మండింది. పూర్తిగా పసుపు రంగు అద్దుకొని, ఆంధ్రజ్యోతి ని మించిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే ఈనాడు తనకు చావు బతుకుల సమస్యగా పోరాడింది. చివరికి ప్రజల చేతిలో జగన్ ఓడిపోయాడు. తనకు అనుకూలమైన చంద్రబాబు 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాడు. అటు తెలంగాణలోనూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ ముఖ్యమంత్రి కాబట్టి పెద్ద ఫరక్ లేదు. కెసిఆర్ తో పెద్దగా వైరం లేదు. కాబట్టి రామోజీరావు చాలా రోజుల తర్వాత నవ్వుతున్నాడు. ఎగురుతున్న పసుపు జెండాను చూసి గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడు.
ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి చెప్పాల్సి వస్తే.. ఈసారి కొత్తగా ఏముంది.. అతడు ప్రతిసారి టిడిపి కార్యకర్తగానే పనిచేశాడు. తన పత్రికను పసుపు కరపత్రం లాగానే మార్చాడు. ఇక్కడ కేసీఆర్ తో తేడా, అక్కడ జగన్ తో వైరం.. అటుకులే బుక్కాడో, ఆముదమే తాగాడో తెలియదు గాని.. మొండిగా నిలబడ్డాడు.. ఇతడు కూడా ఇప్పుడు రామోజీరావు లాగానే ఫుల్ హ్యాపీ.. ఎందుకంటే తెలంగాణలో తనకు అనుకూలమైన రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పైగా అతనితో పర్సనల్ రిలేషన్ కూడా ఉంది. అటు ఏపీలో చంద్రబాబు తన మనిషి కాబట్టి డబుల్ హ్యాపీ.. ఇక ఈ జాబితాలో టీవీ5, మహా న్యూస్ ఉంటాయి. కానీ, అవి ఈనాడు, ఆంధ్రజ్యోతి స్థాయిలో పనిచేయలేదు. ఎందుకంటే వీటికి చంద్రబాబు అంత సీన్ ఇవ్వడు. ఇవ్వలేడు.
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కి బలమైన సాక్షి ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అది వెంట్రుక వాసి కూడా పాజిటివిటీని పెంచలేకపోయింది. సోషల్ మీడియా గ్రూపులు, వెబ్ సైట్ లు రకరకాల మాధ్యమాలు ఉన్నప్పటికీ.. వాటి కోసం జగన్ భారీగా ఖర్చు చేసినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది.. స్థూలంగా చెప్పాలంటే ఇతర దేశాల్లో ఉన్న టిడిపి గ్రూపులు చంద్రబాబు కోసం పని చేశాయి. ఇక అరెస్టులు, దాడులు, ఇతర వ్యవహారాలు చంద్రబాబు మీద పాజిటివిటీని పెంచాయి. వీటిని ఎదుర్కోవడంలో జగన్ ఫెయిల్ అయ్యాడు, సాక్షి వైఫల్యం చెందింది. ఇప్పుడిక జగన్ ఏం చేస్తాడు? సాక్షి ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అనేవి సమాధానాలు లభించాల్సిన ప్రశ్నలు. ఇన్ని సందేహాల మధ్య, చంద్రబాబు నాయుడు ఐదేళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు.