https://oktelugu.com/

AP Assembly Budget Session 2025: గవర్నర్ ప్రసంగం.. సభకు జగన్మోహన్ రెడ్డి.. పది నిమిషాల్లోనే అంతా!

గవర్నర్ ప్రసంగం వేళ సభలోకి వచ్చారు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎమ్మెల్యేలు. కానీ కొద్దిసేపైనా సభలో ఉండలేదు.

Written By:
  • Dharma
  • , Updated On : February 24, 2025 / 12:02 PM IST
    AP Assembly Budget Session 2025 (1)

    AP Assembly Budget Session 2025 (1)

    Follow us on

    AP Assembly Budget Session 2025: ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy ) సభలో పాల్గొంటారని తెలియడంతో ఒక్కసారిగా రాజకీయ సీన్ మారింది. రాష్ట్ర ప్రజల్లో కూడా అత్యంత ఉత్కంఠ కలిగింది. అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రమే పరిమితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణం చూపుతూ ఇన్ని రోజులు శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. అయితే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఆయన సభలో ఐదు నిమిషాలు కూర్చోకుండానే వెన్ను తిరగడం మాత్రం నిరాశపరిచింది.

    * నిలదీస్తారు అనుకుంటే..
    కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల జాడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత ప్రారంభం అయ్యిందని.. అందుకే శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు హాజరవుతారని టాక్ నడిచింది. పైగా సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు చేయనున్నారు. దీనిపై కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సభలో మాట్లాడతారని అంతా భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో సభకు వచ్చారు. కానీ అక్కడ కూర్చోకుండానే బయటకు వెళ్లిపోయారు.

    * సరిగ్గా గవర్నర్ ప్రసంగం లో..
    ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Abdul Nazeer ) ప్రసంగం 10 గంటలకు ప్రారంభం అయ్యింది. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలోకి ప్రవేశించారు. పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ప్రజా గొంతుక వినాలంటే వైసిపికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ చట్టసభల వేదికగా డిమాండ్ చేయడం చర్చకు దారితీసింది. అయితే వైసిపి కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న నిరసన వ్యక్తం చేసేందుకే సభకు హాజరు కావడం మాత్రం విమర్శలకు గురిచేస్తోంది.

    * ఆ డిమాండ్ సరికాదు
    వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ డిమాండ్ చేయడం మాత్రం ఏమాత్రం బాగాలేదు. కనీసం గవర్నర్ ప్రసంగాన్ని వినలేదు. ఐదు నిమిషాల పాటు సభలో కూర్చోలేదు. ఒకవైపు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా.. మరోవైపు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలతో హోరెత్తించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. చివరకు గవర్నర్ ప్రసంగాన్ని సైతం బహిష్కరించారు. పట్టుమని పది నిమిషాలు కూడా వైసిపి సభ్యులు సభలో కూర్చోలేదు. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కంటే తమకు ప్రతిపక్ష హోదా కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభకు హాజరైనట్లు తేలిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు జగన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.