AP 10th Class Hall Ticket QR Code: ఏపీలో( Andhra Pradesh) పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దీని సాయంతో పరీక్షా కేంద్రం వివరాలను చాలా సులువుగా తెలుసుకోవచ్చు. పెద్ద పెద్ద పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద.. ఒక రకమైన గందరగోళం కొనసాగుతూ ఉంటుంది. పరీక్ష కేంద్రాలు వివరాలు తెలుసుకుని వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే కొత్తగా క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. దీనిని స్కాన్ చేస్తే చాలు క్షణాల్లో వివరాలు తెలిసిపోతాయి. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా హాల్ టికెట్ల జారీ సులువుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్ ప్రచురించడం ద్వారా సులువుగా వివరాలు పొందవచ్చు అన్నమాట.
Also Read: ఏపీలో డిఎల్ఎఫ్.. పెద్ద ప్లాన్లు ఇవి
* విద్యావ్యవస్థలో మార్పులు..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) ఎన్నెన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. సరికొత్తగా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల కోసం వందరోజుల ప్రణాళిక, సెలవు రోజుల్లో మధ్యాహ్నం భోజనం, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి కల్పిస్తున్నారు. ఏకంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షల నిర్వహణ సమయం మధ్య గడువు కూడా పెంచారు. శత శాతం ఉత్తీర్ణత కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు పదో తరగతి విద్యార్థులకు జారీచేసిన హాల్ టికెట్ల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కొన్ని రకాల మార్పులు చేయడంతో పాటు పరీక్ష కేంద్రం విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఈ సరికొత్త ప్రయోగం చేసింది.
* అన్ని ప్రత్యేకమే..
విద్యార్థుల హాల్ టికెట్ కు సంబంధించి ఒక క్యూఆర్ కోడ్( QR code) ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ను స్మార్ట్ఫోన్తో స్కాన్ చేస్తే చాలు ఎగ్జామ్స్ సెంటర్ వివరాలు తెలుసుకోవచ్చు. గతంలో పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకునేందుకు అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. అందుకే హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ లో అన్ని వివరాలు పొందుపరిచారు. ఇప్పటికే 10వ తరగతి హాల్ టికెట్లను ఆన్లైన్లో ఉంచారు. ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించనున్నారు. ఈసారి హాల్ టికెట్ పై విద్యార్థి ఫోటో, కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది. హాల్ టికెట్ పై భాగంలో రోల్ నెంబర్ తో పాటుగా లీప్ యాప్, ఏపీ ప్రభుత్వం రాజముద్ర కూడా ఉండనుంది. అయితే ఈసారి హాల్ టికెట్ పై పరీక్షలకు సంబంధించిన టైమింగ్స్ కూడా పొందుపరచడం విశేషం. ఇదే హాల్ టికెట్ చూపించి పరీక్షల సమయంలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం సైతం పొందవచ్చు.