Amaravati development: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణంలో ఒక ముందడుగు పడింది. రాజధాని నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించే సి ఆర్ డి ఏ కు సొంత భవనం సమకూరుంది. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం అందరి ఆమోదంతో అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించే వీలుగా సి ఆర్ డి ఏ భవనం పూర్తిచేయాలని భావించింది. దాదాపు 80 శాతానికి పైగా పూర్తి చేసింది. అయితే ఇంతలో అధికారం మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అమరావతిని నిర్వీర్యం చేస్తూ మూడు రాజధానుల ను తెరపైకి తెచ్చింది. సిఆర్డిఏ భవనం నిర్మాణాన్ని విడిచిపెట్టింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. సిఆర్డిఏ భవనానికి సంబంధించిన పెండింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం చంద్రబాబు సిఆర్డిఏ భవనాన్ని ప్రారంభించారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
ఒక మైలురాయి
అమరావతి రాజధాని కి ఒక మైలురాయిగా నిలవనుంది సిఆర్డిఏ భవనం( crda building). 2017 లో రాయపూడి సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్ వద్ద సిఆర్డిఏ భవన నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ కాంప్లెక్స్ రాజధాని అమరావతి గుర్తింపును ప్రతిబింబించేలా.. దాని ముందు A అనే అక్షరం ఉంటుంది. ఇకనుంచి భవిష్యత్తులో జరిగే అమరావతి నిర్మాణ కార్యకలాపాలు అన్ని ఇక్కడి నుంచి పర్యవేక్షించబడతాయి. 4.32 ఎకరాలలో ఈ కార్యాలయ భవనం విస్తరించి ఉంది. మూడు లక్షల 7320 ఆరు చదరపు అడుగుల్లో ఏడు అంతస్తుల నిర్మాణం కలిగి ఉంది. 73 సెంట్లు ప్రధాన భవనం ఉండగా.. గ్రీన్ జోన్ గా 88 సెంట్లు.. పార్కింగ్ కోసం 1.36 ఎకరాలు… మరో 96 సెంట్లు బహిరంగస్థలం.. మరో 39 సెంట్లు మురుగునీటి శుద్ధి కర్మాగారం కోసం కేటాయించారు.
పురపాలక శాఖ కార్యకలాపాలు..
అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పురపాలక శాఖకు( Municipal department) సంబంధించి కార్యకలాపాలు సిఆర్డిఏ నుంచి ప్రారంభం కానున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ ఉన్నారు. ఆయన అమరావతి రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. అందుకే పురపాలక శాఖ కార్యాలయంగా కూడా దానిని వాడుకోనున్నారు. అమరావతిలో ఇప్పుడు 79 ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని భవనాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన భవనాల పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో రాజధానిలో ప్రైవేటు సంస్థలకు చాలా భూములు కేటాయించారు. వాటిలో కూడా నిర్మాణ పనులు ప్రారంభించాయి ప్రైవేట్ సంస్థలు. దీంతో అమరావతి ప్రాంతం యంత్రాలు, వాహనాలు, మనుషులతో సందడిగా కనిపిస్తోంది. పనులు ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్నాయి.