Marri Rajasekhar Reddy: సీపీకి ( YSR Congress )మరో షాక్ తగలనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన చాలామంది నేతలు వైసిపికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో మరో నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీని దాదాపు విడిచి పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జగన్ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో మర్రి రాజశేఖర్ పార్టీని వీడడం ఖాయమని తెలుస్తోంది. సమావేశానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, నేరుగా నాగార్జున, విడదల రజిని హాజరయ్యారు. అలాగే ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ వంటి వారు హాజరయ్యారు. అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు కూడా వచ్చారు. మరి రాజశేఖర్ హాజరు కాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నారని స్పష్టమవుతోంది.
* తీవ్ర అసంతృప్తితో
మర్రి రాజశేఖర్( Marri Rajasekhar) గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోనే ఉన్నారు రాజశేఖర్. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ కు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు. కానీ రాజశేఖర్ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఆశించారు రాజశేఖర్. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన విడదల రజనీకి ఛాన్స్ ఇచ్చారు జగన్. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు రాజశేఖర్. అయితే జగన్ సముదాయించారు. ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రిగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంలో చాలా జాప్యం జరిగింది. కేవలం ఎమ్మెల్సీ గానే మర్రి రాజశేఖర్ కు అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి.
* మళ్లీ రజనీకి ఛాన్స్ ఇవ్వడంతో
ఈ ఎన్నికల్లో చిలకలూరిపేట( chilakaluripeta ) నుంచి విడదల రజినిని తప్పించారు. మర్రి రాజశేఖర్ కు అవకాశం ఇస్తారని అంతా భావించారు. రజిని పై అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. చిలకలూరిపేటలో మరో నేతకు అవకాశం ఇచ్చారు జగన్. అప్పటినుంచి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో వైసిపి ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవల విడదల రజినికి చిలకలూరిపేట ఇన్చార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు మర్రి రాజశేఖర్. అందుకే టిడిపిలోకి వెళ్లిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.
* అనుచరులకు పిలుపు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానని.. అయినా సరే నా సేవలకు గుర్తింపు లేదంటూ ఆయన అనుచరుల వద్ద ఆవేదన చెందారు. ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారని.. కానీ ఆ హామీని బుట్ట దాఖలు చేశారని.. అందుకే పార్టీ మారిపోతానని.. అనుచరులకు సమాచారం ఇచ్చారట మర్రి రాజశేఖర్. ఈరోజు వైసిపి సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంతో.. పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తోంది.