AP Survey: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సర్వే సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాయి. నేషనల్ మీడియా సంస్థల సహకారంతో వాటి ఫలితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా జన్మత్ పోల్ సంస్థ సర్వే చేపట్టింది. రెండు రోజుల కిందట సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట సర్వే చేపట్టింది.
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా నడుస్తుందని ఈ సర్వే తేల్చింది. బిజెపి 326 నుంచి 328 స్థానాలను దక్కించుకుంటుందని తేలింది. కాంగ్రెస్ పార్టీకి 43 నుంచి 45 స్థానాలు వస్తాయని తేల్చింది. ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఏపీలో అధికార వైసిపి 19 నుంచి 20, తృణమూల్ కాంగ్రెస్ 21 నుంచి 23, ఒడిస్సా లోని బిజెడికి 10 నుంచి 11, అమ్ ఆద్మీ పార్టీకి 7 నుంచి 8 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టు తేలింది.అటు ఏపీలో కొత్తగా కూటమి కట్టిన టిడిపి,జనసేన, బిజెపిలకు కేవలం మూడు నుంచి నాలుగు లోక్ సభ స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చడం విశేషం.
ఇటీవల టిడిపి, జనసేన, బిజెపిల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం కొలిక్కి వచ్చింది. అభ్యర్థులను ప్రకటించేందుకు మూడు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఈ సర్వే వచ్చింది. ఏపీ అసెంబ్లీకి సంబంధించి వైసీపీ 119 నుంచి 120 స్థానాలు, కూటమికి 49 నుంచి 51 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. అయితే పార్లమెంట్ స్థానాల కంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు కాస్త మెరుగైన ఫలితాలు సాధించనున్నారని చెప్పడం విశేషం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. వైసీపీకి 20 పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. ఈ లెక్కన 140 స్థానాలు వరకు గెలుచుకోవాలి. కూటమికి నాలుగు ఎంపీ సీట్ల వచ్చే అవకాశం ఉందని సర్వేలో చెప్పుకొచ్చారు. ఈ లెక్కన 28 స్థానాలకే కూటమి పరిమితం కావాలి. కానీ లెక్కలో చాలా వరకు తేడా కనిపిస్తోంది. ఇది వైసిపి అనుకూలంగా చేసుకున్న సర్వే అని టిడిపి చెబుతుండగా.. పూర్తి పారదర్శకమైన సర్వే అంటూ వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట ఈ సర్వేల ఫలితాలు ఏపీ ప్రజలను ఒక రకమైన గందరగోళ పరిస్థితుల్లో నెడుతున్నాయి.