MP Avinash Reddy Case : ఎంపీ అవినాష్ రెడ్డి కేసులో మరో సంచలనం

అటు టీడీపీ అనుకూల మీడియా సైతం ప్రచారంతో హోరెత్తించింది. కానీ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ కు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది. దీంతో సంచలనాలు నమోదవుతాయనుకున్న టీడీపీ శిబిరంలో నిరాశ అలుముకుంది. 

Written By: Dharma, Updated On : May 31, 2023 12:57 pm
Follow us on

MP Avinash Reddy Case : కడప ఎంపీ అవినాష్ రెడ్డికి భారీ ఊరట. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ముందస్తు బెయిల్ పై అవినాష్ రెడ్డి పెట్టుకున్న పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తుది తీర్పు వెల్లడించింది. వివేకా హత్య కేసులో సహ నిందితుడిగా సీబీఐ అవినాష్ రెడ్డిని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. ఒక వేళ విచారణకు హాజరైతే సీబీఐ అరెస్టు చేయనుందని వార్తలు వచ్చాయి. దీంతో అవినాష్ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ పెట్టుకున్నారు. తాజా కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనకు భారీ ఊరట లభించినట్టయ్యింది.

తీవ్ర ఉత్కంఠ నడుమ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై ఈ నెల 27న విచారణ చేపట్టింది. సీబీఐకి పలురకాలుగా ప్రశ్నించింది. మే 31 వరకూ తీర్పు రిజర్వులో పెట్టింది. అంతవరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం తుది తీర్పు వెల్లడించింది. వివేకా హత్య కేసు లో అవినాష్ ను ఇరికించడానికి ప్రయత్నం జరుగుతోందన్న ఆయన తరపు లాయర్ల వాదనల తో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. షరతులతో కూడిన బెయిల్ ను  మంజూరు చేసింది. అవినాష్ రెడ్డి ని కస్టడీ లోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని బెంచ్ సీబీఐ తరపు న్యాయవాదుల కు స్పష్టం చేసింది.

అవినాష్ అరెస్టు తప్పదని.. సంచలనాలు నమోదవుతాయని ప్రచారం జరగడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. అదే జరిగితే వైసీపీకి  రాజకీయంగా డ్యామేజ్ తప్పదని భావించారు. కానీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. సాక్షుల ను ప్రభావితం చేయొద్దని సూచించింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

అవినాష్ కు బెయిల్ రావడంతో వైసీపీ శిబిరంలో ఆనందం మిన్నంటింది. మొన్నటికి మొన్న కోర్టు వాదనల్లో అనూహ్యంగా సీఎం జగన్ ప్రస్తావన వచ్చింది. వివేకా హత్య విషయం జగన్ కు ముందే తెలుసునన్న వాదన తెరపైకి తేవడంతో ఒక రకమైన ఆందోళన నెలకొంది. అవినాష్ రెడ్డి అరెస్టుతో ఏదో సంచలనాలకు సీబీఐ ప్రయత్నిస్తోందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. అటు టీడీపీ అనుకూల మీడియా సైతం ప్రచారంతో హోరెత్తించింది. కానీ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ కు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది. దీంతో సంచలనాలు నమోదవుతాయనుకున్న టీడీపీ శిబిరంలో నిరాశ అలుముకుంది.