https://oktelugu.com/

Chandrababu Naidu : చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్

శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మహానాడులో ప్రవేశ పెట్టే తీర్మానాలను చర్చించి ఆమోదించనున్నారు. మొత్తం 20 తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. అందులో ఏపీకి సంబంధించి 14, తెలంగాణకు సంబంధించి ఆరు ఉండనున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : May 26, 2023 / 02:19 PM IST
    Follow us on

    Chandrababu Naidu : వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న టీడీపీ మహా సంగ్రామానికి సిద్ధమవుతోంది. పార్టీ పండుగ మహానాడు నుంచి సమర శంఖం పూరించనుంది. గోదావరి తీరాన మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల ఏడాది కావడంతో పార్టీ మైలేజ్ ను పెంచే విధంగా మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ మేనిఫెస్టో, పొత్తులు, పార్టీలో చేరికలు వంటి వాటిపై నాయకత్వం మరింత స్పష్టత ఇవ్వనుంది. మూడురోజుల పాటు జరగనున్న మహానాడుకు సుమారు 15 లక్షల మంది తరలివస్తారని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తోంది.

    గత మహానాడు ఒంగోలులో నిర్వహించారు. కనీవినీ ఎరుగని రీతిలో జనాభా వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీకి అప్పటి నుంచే జవసత్వాలు వచ్చాయి. అందుకే ఈసారి మహానాడును వ్యూహాత్మకంగా రాజమండ్రిలో ఏర్పాటుచేశారు. కోస్తాకు, ఉత్తరాంధ్రకు సెంటర్ పాయింట్ కావడంతో భారీగా జనాలు తరలివచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలు కీలకం. ఈ లెక్కను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.రాజమండ్రిలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. 27న పార్టీ ప్రతినిధుల సభ..28న మహానాడు బహిరంగ సభను నిర్వహించనున్నారు.

    మేనిఫెస్టో పైన మహానాడు వేదికగా స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు. తాను అందిస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని సీఎం జగన్ ధీమాగా ఉన్నారు. దీంతో జగన్ సంక్షేమానికి కౌంటర్ గా చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్న అంశం. జనసేనతో టీడీపీ పొత్తు దాదాపు ఖాయమైంది. బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ మహానాడు వేదికగా ఆమోదించే రాజకీయ తీర్మానాల్లో పొత్తులపైన కూడా ఉంటుందని తెలుస్తోంది. పొత్తులు..సీట్ల కేటాయింపు..వర్గాల వారీగా ప్రాధాన్యత పైన చంద్రబాబు బహిరంగ సభలో స్పష్టత ఇవ్వనున్నారు.

    కాగా చంద్రబాబు మహానాడులో పాల్గొనేందుకు శుక్రవారం మధ్యాహ్నం రాజమండ్రి చేరుకోనున్నారు. ఇప్పటికే మహానాడు కోసం లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించారు.ఈ రోజు సాయంత్రానికి మహానాడు వేదిక ప్రాంగణానికి చేరుకోనున్నారు. తండ్రీ కొడుకులకు ప్రత్యేక విడిదిలు లేవు.  మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బస్సుల్లోనూ ఇద్దరూ బస చేయనున్నారు. శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మహానాడులో ప్రవేశ పెట్టే తీర్మానాలను చర్చించి ఆమోదించనున్నారు. మొత్తం 20 తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. అందులో ఏపీకి సంబంధించి 14, తెలంగాణకు సంబంధించి ఆరు ఉండనున్నాయి. మొత్తానికైతే మహానాడు వేదికగా టీడీపీ తీసుకోబోయే నిర్ణయాలు సంచలనంగా మారనున్నాయి.