Tirupati Leopard: నడక మార్గంలో వెళ్తున్న వెంకన్న భక్తులను చిరుతపులులు గడగడలాడిస్తున్నాయి. ఇటీవల నడక మార్గంలో వెళ్తున్న ఓ భక్త బృందానికి చెందిన ఓ బాలికను చిరుత పులి నోట కరుచుకుని చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరుపై భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో నడక మార్గంలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆత్మరక్షణార్థం చేతి కర్రలు పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఇది ఇలా ఉండగానే అక్కడక్కడ చిరుతపులులు సంచరిస్తున్నట్టు వార్తలు రావడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. ఆ మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలంటే భయపడుతున్నారు. అయితే భక్తుల్లో భయం పోగొట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అడవుల్లో బోనులు ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలు బిగించి చిరుత పులుల కదలికలను గమనించారు. అలా ఇప్పటికే నాలుగు చిరుతపులలను బంధించారు. తాజాగా గురువారం నరసింహస్వామి ఆలయం.. ఏడవ మైల్ కి మధ్యలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత పులి చిక్కింది. ఈ పులిని బంధించడం ద్వారా 75 రోజుల వివదిలో ఐదు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు.
నరసింహ స్వామి ఆలయం.. ఏడవ మైల్ కి మధ్యలో ఏర్పాటు చేసిన బోనులో ఒక చిరుత పులి చిక్కింది. పది రోజుల క్రితమే ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఏడవ మైల్ కి మధ్యలో ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత పులి చిక్కింది. 75 రోజుల పరిధిలో చిక్కిన ఐదవ చిరుత పులి కావడం విశేషం. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకున్న చర్యల వల్ల కొండపై అరణ్యాలు దట్టంగా పెరిగాయి. నడక మార్గంలో వెళ్తున్న భక్తులు జింక పిల్లలకు ఆహారం అందిస్తుండడంతో అవి అటువైపుగా ఎక్కువగా వస్తున్నాయి. వాటిని వేటాడే క్రమంలో చిరుత పులులు కూడా అక్కడికి వస్తున్నాయి. జింకలు వేటకు చిక్కనప్పుడు అవి నేరుగా మనుషుల మీద దాడి చేస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జింకల సంచారం ఎక్కువ కావడంతో చిరుతపులులు ఎక్కువగా వస్తున్నాయని, భక్తులకు కూడా తాము అవగాహన కల్పిస్తున్నామని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఆహార అన్వేషణలో చిరుతపులులు ఎక్కువగా తిరుగుతుంటాయని, అలాంటప్పుడు వాటిని నియంత్రించడం కష్ట సాధ్యంగా మారుతోందని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
ఇక అలిపిరి నడకదారిలో గడచిన జూన్ 22, ఆగస్టు 11వ తేదీలలో చిన్నారులు కౌశిక్, లక్షితపై చిరుతపులు దాడి చేశాయి. ఈ దాడుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నడక మార్గంలో సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. చిన్నారులపై జరిగిన దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉలిక్కిపడ్డారు. చిరుత పులుల నుంచి భక్తులను కాపాడేందుకు అటవీ శాఖ అధికారుల సహాయం తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన నడక మార్గంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి ఆధారంగా చిరుత పులుల కదలికలు గమనించారు. వెంటనే పలుచోట్ల బోన్లు ఏర్పాటు చేసి చిరుతపులులను పట్టుకున్నారు. అయితే తాజాగా పట్టుబడిన చిరుత సంఖ్య ఐదవది అని చెబుతున్నప్పటికీ.. దానిని అధికారికంగా ధ్రువీకరించలేమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంటున్నారు. ఇక తొలుత పట్టుకున్న చిరుతను అటవీ అధికారులు అత్యంత సమీపంలో విడిచిపెట్టారు. రెండవసారి, మూడవ సారి పట్టుకున్న చిరుతలను జూ పార్క్ లో ఉంచారు. అయితే నాలుగవ చిరుతను ఏం చేశారనేది అటవీ శాఖ అధికారులు చెప్పడం లేదు. ఇక మొదటి మూడు పులులు రెండు నుంచి మూడు ఏళ్ల వయసు కలిగి ఉన్నాయి. నాలుగోది మాత్రం ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు మధ్య ఉంటుందని అధికారులు అంటున్నారు.. ఇక తాజాగా పట్టుకున్న చిరుతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజాగా చిరుత పులిని అటవీ శాఖ అధికారులు బంధించినంత మాత్రాన..చిరుతల సంచారం ఆగిపోయినట్టు కాదని భక్తులు అంటున్నారు. చిరుతపులులు విస్తారంగా తిరుగుతుండడంతో నడక మార్గంలో వెళ్లి వెంకన్నను దర్శనం చేసుకోవాలంటేనే వెన్నులో వణుకు పుడుతుందని భక్తులు అంటున్నారు.. వాస్తవానికి చిరుతపులు ఈ స్థాయిలో భయాందోళన కలిగిస్తున్నప్పటికీ.. అసలు చిరుతపులుల సంఖ్య ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం అటవీ శాఖ అధికారులు చేయకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు.