AP Rain Alert: ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. శనివారం దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీతోపాటు తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీకి భారీ వర్ష సూచన ఉండడంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం అయ్యింది. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే దీని ప్రభావంతో ఏపీలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఈనెల 29 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.
* నేటి నుంచి భారీ వర్షాలు..
అయితే ఒడిస్సా( Odisha ), ఉత్తరాంధ్ర తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి భారీ వర్షాలు నమోదు అవుతాయి. ప్రధానంగా పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో సైతం వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
* మూడు అలెర్టుల జారీ
గత కొద్ది రోజులుగా ఉత్తరాంధ్రలో( North Andhra) పిడుగుల మోతతో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో సైతం ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడనున్న నేపథ్యంలో.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్.. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండం ప్రభావంతో ఏపీకి భారీ ఉపద్రవం ఉన్నట్లు చెబుతోంది వాతావరణ శాఖ. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ముందుగానే అప్రమత్తం అయింది. ప్రజలకు భారీ హెచ్చరికలు జారీ చేస్తోంది.