Homeఆంధ్రప్రదేశ్‌TDP Governor Post Buzz: చంద్రబాబు చేతిలో ఆ ముగ్గురు భవిత!

TDP Governor Post Buzz: చంద్రబాబు చేతిలో ఆ ముగ్గురు భవిత!

TDP Governor Post Buzz: ఏపీలో( Andhra Pradesh) సీనియర్ మోస్ట్ లీడర్లు ఎంతోమంది ఉన్నారు. అందులో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నుంచి తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్న వారు ఉన్నారు. అయితే చాలామంది తమ వారసులను బరిలో దించి తాము క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అటువంటి వారు ఉన్నత పదవులు కోరుకుంటున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు యనమల రామకృష్ణుడు, కెఈ కృష్ణమూర్తి, ప్రతిభా భారతి. ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారే. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రి పదవి ఖాయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు, చంద్రబాబుతో సైతం వీరు సన్నిహితంగా ఉండేవారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలంగా సమర్ధించేవారు. అయితే ఇప్పుడు వీరు గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకుంటున్నారు. జాతీయస్థాయిలో మంచి పదవి చేపట్టి రాజకీయాల్లో ఒక అరుదైన గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. మరో గవర్నర్ పోస్ట్ టిడిపికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

చంద్రబాబుకు సన్నిహితుడు..
యనమల రామకృష్ణుడు( Yanamala Ramakrishnudu) సీనియర్ మోస్ట్ లీడర్. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. 1983లో తొలిసారిగా తుని నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అది మొదలు 1999 వరకు రికార్డ్ స్థాయిలో వరుసగా గెలుస్తూ వచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యనమల రామకృష్ణుడికి మంత్రి పదవి వచ్చేది. 1994లో మాత్రం యనమల రామకృష్ణుడు శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు. ఆ సమయంలోనే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. యనమల రామకృష్ణుడు చంద్రబాబుకు అండగా నిలబడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు దోహదపడ్డారు. అందుకే చంద్రబాబు యనమల రామకృష్ణుడు కు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. 1999లో తన క్యాబినెట్లోకి తీసుకొని ఆర్థిక మంత్రి పదవి కేటాయించారు. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమలను మంత్రివర్గంలోకి తీసుకొని ఆర్థిక శాఖను కేటాయించారు. అయితే ఈసారి ఆయనకు ఎటువంటి పదవి లేదు. ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా లేకుండా పోయింది. ఇతరుణంలో యనమల రామకృష్ణుడుకు రాజ్యసభ పదవి ఇస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి. తప్పకుండా ఆయనకు పదవి వరించే అవకాశం ఉంది.

బలమైన బీసీ నేత..
కేఈ కృష్ణమూర్తి( KE Krishnamurthy ) రాయలసీమలో బలమైన బీసీ నేత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు. టిడిపి రాజకీయాలను తనదైన శైలిలో పోషించుకుంటూ ముందుకు సాగారు. రాయలసీమ అంటేనే రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం అధికం. అటువంటిది కెఈ కృష్ణమూర్తి తనకంటూ ఒక ముద్ర చాటుకుంటూ వచ్చారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి లభించడం అనేది రివాజు. కానీ ఈసారి ఆయన కుమారుడు శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే టిడిపికి గవర్నర్ పోస్ట్ కేటాయిస్తే బీసీల కోటాలో కేఈ కృష్ణమూర్తిని పంపిస్తారని తెలుస్తోంది. తద్వారా రాయలసీమలో బీసీలను తమ వైపు తిప్పుకోవచ్చు అన్నది చంద్రబాబు ప్లాన్.

గవర్నర్ పోస్ట్ కు ప్రతిభాభారతి..
మరోవైపు గవర్నర్ పోస్ట్ కు ప్రతిభా భారతి( Pratibha Bharati ) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాలు మొదలుపెట్టారు ప్రతిభా భారతి. 1983 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ ఆమెను తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. 1999 వరకు వరుసగా ఐదు సార్లు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి ఆమె గెలిచారు. 1999లో ఆమె శాసనసభ స్పీకర్ గా కూడా ఎంపికయ్యారు. ఏపీ నుంచి శాసనసభ స్పీకర్గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె గుర్తింపు సాధించారు. ప్రస్తుతం ఆమె కుమార్తె గ్రీష్మ టిడిపి ఎమ్మెల్సీగా ఉన్నారు. కేంద్రం గవర్నర్ పోస్ట్ ఇస్తే ప్రతిభాభారతికి కేటాయిస్తారని ప్రచారం నడుస్తోంది. ఆమె సీనియర్ నాయకురాలతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. అందుకే సామాజిక సమతుల్యత దృష్ట్యా ఆమె పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. ఇలా ముగ్గురు సీనియర్ నేతల భవితవ్యం చుట్టూ చర్చ నడుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version