Anna Canteens: పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను తెరిచింది. రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా క్యాంటీన్ల ద్వారా ఆహారం అందుతుంది. ఉదయం టిఫిన్ తో పాటు రెండు పూటలా భోజనాన్ని 15 రూపాయలకే అందిస్తున్నారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో నగరాలతో పాటు పట్టణాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అటు తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం క్యాంటీన్లను మూసివేసింది. నిరుపయోగంగా వదిలేసింది. అయితే తాము అధికారంలోకి వస్తే తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను తెరిచారు. నగరాలతో పాటు పట్టణాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజయవంతంగా అవి నడుస్తున్నాయి. అన్న క్యాంటీన్ల నిర్వహణపై సామాన్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా క్యాంటీన్లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
* ఆర్థిక శాఖ క్లియరెన్స్
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 199 అన్న క్యాంటీన్ లను ప్రారంభించింది. మరికొన్ని క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని కూడా త్వరితగతిన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు ఏర్పాటు చేసిన క్యాంటీన్లన్నీ పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ తరుణంలో ఎంపిక చేసిన గ్రామాల్లో క్యాంటీన్లు తెరవాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అందుకే పల్లెల్లో సైతం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆ మేరకు ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు.
* త్వరలో మార్గదర్శకాలు
వచ్చే మూడు నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో 63 క్యాంటీన్ల ప్రారంభానికి వీలుగా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో మార్గదర్శకాలు కూడా జారీ చేసి పరిస్థితి కనిపిస్తోంది. వీటికి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో అన్న క్యాంటీన్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఉదయం టిఫిన్ తో పాటు రెండు పూటలా భోజనం 15 రూపాయలకు అందుతుండడంతో పేదలకు ఎంతగానో బాగుంది. అటు అన్న క్యాంటీన్ల నిర్వహణ సైతం బాగుందన్న టాక్ ఉంది. ఈ తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం వీటిని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.