AP Youth Abroad: అమెరికా నుంచి మొదలు పెడితే ఆస్ట్రేలియా వరకు.. కెనడా నుంచి యూకే వరకు.. ఇలా ప్రపంచంలో ఏ దేశాన్ని పరిశీలించినా సరే.. అందులో ఏపీ వాసులు కనిపిస్తారు. ఐటీ నుంచి ఫార్మ వరకు అన్ని రంగాలలో ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. కేవలం ఉద్యోగులుగా మాత్రమే కాదు, ఉన్నత చదువులు చదివే విషయంలో కూడా ఏపీ విద్యార్థులు ముందు వరసలో ఉన్నారు.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం అంతటి కరోనా కాలంలో కూడా ఏపీ నుంచి ఇతర దేశాలకు చదువుకోవడానికి ఏపీ విద్యార్థులు ఏకంగా 35,614 మంది వెళ్లారంటే.. విదేశీ విద్యకు, అత్యున్నత కోర్సులు అభ్యసించడానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. 2016లో 46,818, 2018లో 62,771, 2020లో 35,614 మంది ఏపీ విద్యార్థులు విదేశాలలో చదువుకోడానికి వెళ్లారు. 2016లో 36, 743, 2018లో 60, 331, 2020 35,412 మంది పంజాబ్ విద్యార్థులు విదేశాలలో చదవడానికి వెళ్లారు.
మన దేశంలో ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్నప్పటికీ.. ఉన్నత విద్యను విదేశాలలో అభ్యసించడానికి ఏపీ విద్యార్థులు ఎక్కువగా వెళ్తున్నారు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో విద్యార్థులు ఒక స్థిరమైన క్రమంలో విదేశాలకు వెళ్తున్నారు. కానీ, ఏపి నుంచి మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నారు. మన దేశంలో జనాభా పరంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఈ రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య జనాభాకు తగ్గట్టుగా లేదు. 1990, 2000 మధ్య ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో యువకులు ఎక్కువగా ఇంజనీరింగ్ వైపు ఆసక్తిని ప్రదర్శించారు. ఆ తర్వాత వారంతా కూడా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఇక అప్పటినుంచి ఐటీ రంగంలో విద్యను అభ్యసించడానికి చాలామంది ఆసక్తిని ప్రదర్శించారు. దీంతో విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఈ రాష్ట్రాల నుంచి పెరుగుతుంది. ఏపీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రిపరేషన్ కేంద్రాలు, కౌన్సిలర్లు అందుబాటులో ఉన్నారు. వీరంతా కూడా సమాచార అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశీ అధ్యయనాన్ని సరళ తరం చేసే విధంగా కృషి చేస్తున్నారు.
విదేశాలలో చదువుకోవడం ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ.. చాలామంది తమ కెరియర్ ఉన్నతంగా ఉండాలని భావిస్తున్నారు. బ్యాంకులలో రుణాలు తీసుకుని.. దానికి తగ్గట్టుగా కోర్సులను చదువుతున్నారు. విదేశాలలో పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ.. వ్యయాన్ని తగ్గించుకుంటున్నారు. ఉద్యోగాలలో స్థిరపడి ఆ తర్వాత ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. ఇటీవల కాలంలో ఉద్యోగాల లభ్యత తగ్గిపోయినప్పటికీ.. అది కేవలం యుఎస్ మార్కెట్లో మాత్రమే ఉందని.. యూకే, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో పరిస్థితి ఆశ జనకంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.