Andhra Terror Arrests: భారత దేశంలో ఉగ్రవాదులు అంటే గుర్తుకు వచ్చేది జమ్మూ కశ్మీర్, తర్వాత రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ముంబై గుర్తొస్తాయి. కానీ, ప్రస్తుతం దేశమంతా ఉగ్రవాదులు విస్తరిస్తున్నారు. అయితే ఇంతకాలం ప్రశాంతం అనుకున్న ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పట్టుబడుతున్న ఉగ్రవాదులు తెలుగువారు ఉలిక్కిపడేలా చేస్తున్నారు. ఈ ఘటనలతో ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదుల ఆశ్రయంగా మారిందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా రాయచోటిలో ఇద్దరు..
మే నెలలో విజయనగరంలో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. పేలుళ్లకు కుట్ర పన్నిన సమయంలో పక్కా సమాచారంతో ఇద్దరిని అరెస్టు చేశారు. దీంతో ప్రశాంతంగా ఉండే విజయనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక తాజాగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో మరో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుపడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. 30 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు, అబూబక్కర్ సిద్దీక్(60), మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ (కేరళలోని మేళపలయం), తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో జూన్ 30న అరెస్టయ్యారు. వీరు 1995లో చెన్నైలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు, నాగూరులో పార్సిల్ బాంబు దాడి, 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, కేరళలో ఏడు చోట్ల బాంబు దాడులు, 2011లో ఎల్.కే. అద్వానీ రథయాత్ర సమయంలో పైపు బాంబు దాడి కుట్రతో సహా అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో నిందితులుగా ఉన్నారు.
Also Read: విజయసాయి రెడ్డి రీ ఎంట్రీ.. రంగంలోకి కీలక నేత!
మారువేశంలో స్థానికులతో కలిసిపోయి..
అబూబక్కర్ సిద్దీక్, మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ రాయచోటిలో మారువేషంలో జీవనం సాగిస్తున్నారు. సిద్దీక్ స్థానియ యువతిని పెళ్లి చేసుకుని ఇక్కడే అందరితో కలిసిపోయాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకున్నాడు. చీరల వ్యాపారం చేస్తున్నాడు. మహ్మద్ అలీ మరో చిరు వ్యాపారం చేస్తున్నాడు. స్థానికులు వీరి గురించి తెలియకుండా సహకారం అందిస్తూ వచ్చారు.
రెండు నెలలు నిఘా..
చెన్నై ఇంటెలిజెన్స్ బ్యూరో, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రెండు నెలల పాటు వీరిపై నిఘా పెట్టాయి. స్థానిక పోలీసుల సహాయంతో వీరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తర్వాత వీరిని తమిళనాడుకు తరలించారు, అక్కడ మరింత దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళన కలిగించింది. ఇంతకాలం ఉగ్రవాదులు తమ మధ్య సాధారణంగా తిరుగుతూ ఉండటం షాక్‌కు గురిచేసింది.
ఉగ్రవాదుల ఆశ్రయం..
ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాయచోటి వంటి చిన్న పట్టణాల్లో ఉగ్రవాదులు మారువేషంలో దాక్కున్న సంఘటనలు బయటపడటంతో జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.
గతంలోనూ పట్టుబడిన ఉగ్రవాదులు..
ఆంధ్రప్రదేశ్‌లో గతంలోను పలుమార్లు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. 2007లో హైదరాబాద్‌లోని మక్కా మసీదు వద్ద జరిగిన బాంబు పేలుళ్లు, 2013లో దిల్‌సుఖ్‌నగర్ బాంబు దాడులలో భారతీయ ముజాహిదీన్ (ఐఎమ్) వంటి సంస్థలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఈ ఘటనలలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ఉగ్రవాదులకు తాత్కాలిక ఆశ్రయంగా ఉపయోగపడినట్లు దర్యాప్తులో తేలింది. 2014–16 మధ్య, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న కొందరు వ్యక్తులు గుర్తించబడ్డారు. ఎన్‌ఐఏ. దర్యాప్తులో గుంటూరు, నెల్లూరు వంటి ప్రాంతాలలో ఐఎస్ రిక్రూట్‌మెంట్ కార్యకలాపాలకు సంబంధించిన కొందరు అనుమానితులు అరెస్టయ్యారు. మదనపల్లి, రాజమండ్రిలో కూడా ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఉగ్రవాది గతంలో మదనపల్లికి చెందిన యువతిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. చాలాకాలం తర్వాత అతడిని ఎన్‌ఐఏ గుర్తించింది. ఎల్‌కే.అధ్వానీ హత్యకు యత్నించిన ఉగ్రవాదులను 2013లో రాజమండ్రిలో పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: జగన్ తోనే వంశీ.. ఈ కలయిక వైరల్
ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లేదా ఇతర ఉత్తర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ విజయనగరం, రాయచోటి వంటి సంఘటనలు రాష్ట్రంలో నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.