Ram Gopal Varma : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లపై గతంలో రామ్ గోపాల్ వర్మ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలకు నిరసనగా ఒంగోలు టీడీపీ ముఖ్య నాయకులు ఆయనపై ఆధారాలతో సహా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒంగోలు పోలీసులు ఈ కేసు విచారణ కోసం రామ్ గోపాల్ వర్మ ని ఒంగోలు పోలీస్ స్టేషన్ కి రావాలని ఆదేశించగా ఆయన రాలేదు. అంతే కాకుండా హై కోర్టు లో తనని పోలీసులు అరెస్ట్ చేసి టార్చర్ చేయబోతున్నారని నాకు సమాచారం అందిందని, దయచేసి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటీషన్ వేశాడు రామ్ గోపాల్ వర్మ. దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు రామ్ గోపాల్ వర్మ పై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అంతే కాకుండా పోలీసుల విచారణకు సహకరించాలని రాంగోపాల్ వర్మ ని ఆదేశించింది. ఈమేరకు పోలీసులు 4వ తేదీన విచారణకు రావాల్సిందిగా రామ్ గోపాల్ వర్మని ఆదేశించారు.
వాట్సాప్ ద్వారా స్పందించిన రామ్ గోపాల్ వర్మ, తాను నాల్గవ తేదీన షూటింగ్ లో బిజీ గా ఉంటానని, 7వ తేదీన అయితే కచ్చితంగా అందుబాటులో ఉంటానని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే పోలీసులు రెండుసార్లు వర్మ ని విచారించేందుకు పిలవగా, ఆయన రాలేదు. ఈసారైనా వస్తాడో లేదో చూడాలి. ఒకవేళ రాకపోతే మాత్రం పోలీసులు కూడా కోర్టుని ఆశ్రయించి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ఆయన విచారణకు రాకపోవడం తో, ఒంగోలు నుండి పోలీసుల బృందం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉండే రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు. ఆరోజు సాయంత్రం వరకు రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం ఎదురు చూసి తిరిగి ఒంగోలు కి వెళ్లిపోయారు. రాంగోపాల్ వర్మ పరారీ లో ఉన్నాడు అంటూ వార్తలు వినిపించాయి.
ఈ వార్తలపై పక్క రోజే రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ, నేనెక్కడికి పారిపోలేదు, నా ఇంట్లోనే ఉన్నాను, మా ఆఫీస్ లోకి కూడా పోలీసులు రాలేదు, నాకు ఎలాంటి సమాచారం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇలా రామ్ గోపాల్ వర్మ పోలీసులతోనే ఒక ఆట ఆడుకున్నాడు. ఈసారైనా పోలీసులు అతన్ని పట్టుకోగలరా?, రెండు రోజుల క్రితమే ఆయన్ని చెక్ బౌన్స్ కేసు లో అరెస్ట్ చేయాల్సిందిగా ముంబై లోని అంథేరీ కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు పోలీసులు అతన్ని ముట్టుకోలేకపోయారు. ఎంతో ఉల్లాసంగా ఆయన షూటింగ్స్ చేసుకుంటున్నాడు. ఎందుకని రామ్ గోపాల్ వర్మ ని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు?,ఆయన వెనుక ఏ శక్తి ఉంది అనేది ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్న. ఇకపోతే ప్రస్తుతం రామ్ గోపాల్ ‘సిండికేట్’ అనే పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ మూవీ ని తీస్తున్నాడు . ఇందులో ఇప్పటి వరకు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్ వంటి నటులు ఖరారు అయ్యారు.