AP Kutami Government: ఏపీలో కూటమి( TDP Alliance ) అధికారం చేపట్టి ఈరోజుకు ఏడాది అవుతోంది. సరిగ్గా గత ఏడాది జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న సీఎం గా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ముఖ్యంగా గత రెండుసార్లకు భిన్నంగా.. ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహకారం అందుతూ వస్తోంది. అందుకే రానున్న నాలుగేళ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తొలి మూడు నెలలు పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించింది. ఇంకోవైపు అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ చేసింది. అదే సమయంలో పింఛన్లు పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం, పల్లె పండుగ పేరిట మౌలిక వసతుల కల్పన, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి వాటిని సమర్థవంతంగా అమలు చేయగలిగింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నిలిచిపోయిన చాలా రకాల చెల్లింపులను పూర్తి చేసింది. అయితే ప్రజల నుంచి సంతృప్తి విషయంలో మిశ్రమ స్పందన వస్తోంది.
* సరిగ్గా ఏడాది కిందట..
ఏపీలో( Andhra Pradesh) కూటమి తిరుగులేని విజయం సాధించింది. 164 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించింది. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ కీలకమైన ఐదు శాఖల బాధ్యతలను తీసుకున్నారు. డిప్యూటీ సీఎం హాదా పొందారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తోంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం ముందుకు సాగుతోంది. ఏడాది పాలన పూర్తవుతున్న తరుణంలో ఈరోజు తల్లికి వందనం నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రధానమైన సంక్షేమ పథకాలు పట్టాలెక్కినట్టే.
* ఎన్నికల హామీలపై దృష్టి..
కూటమి అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. రాజధాని అమరావతి( Amaravati capital ), పోలవరం ప్రాజెక్ట్, రోడ్ల మరమ్మతులతో పాటుగా సూపర్ సిక్స్ లో భాగంగా వరుసగా పథకాలను అమలు చేస్తూ వస్తోంది. పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచింది. భారీ ఉపాధ్యాయ నియామకం చేపట్టింది. 16 వేల నాలుగు వందల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పంచాయితీలకు నిధులు, గ్రామాల్లో రోడ్లు, రైతులకు సాయం, ఉద్యోగాల భర్తీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. గత నెలలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం పంచాయితీల అభివృద్ధికి రూ.990 కోట్ల నిధులు ఇచ్చింది. ఏడాదిలోనే నాలుగు వేల కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించింది కూటమి ప్రభుత్వం.
* వేలాది గ్రామాల్లో ఒకేరోజు గ్రామసభలు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం సంక్షేమం మాటున అభివృద్ధిని మరుగున పడేసింది. ఈ తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 13,218 గ్రామ పంచాయితీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా 20 వేలకు పైగా మినీ గోకులాలను నిర్మించారు. పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో 20వేల నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో వందలాది నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా పల్లె పండుగ పేరిట గ్రామాల్లో రహదారులు, మురుగు కాలువలు పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన చాలా గ్రామాలు అభివృద్ధి పథంలోకి వచ్చాయి.
* పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి..
పారిశ్రామిక రంగంలో( industrial field) కూడా ఏపీ గణనీయమైన అభివృద్ధి సాధించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపింది. అనకాపల్లి జిల్లాలో రూ.1.85 లక్షల కోట్లతో NTPC గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, శ్రీ సిటీలో రూ.5వేల కోట్లతో LG ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, రూ.65 వేలకోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, అనకాపల్లిలో రూ.1.35 కోట్లతో స్టీల్ ప్లాంట్, రామాయపట్నంలో రూ.96,862 కోట్లతో bcpl రిఫైనరీ, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో MSME పార్కుల ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖను ఐటి హబ్ గా మార్చాలని బలమైన సంకల్పంతో ఉన్నారు. ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖకు వస్తున్నాయి.
* కేంద్రం వరాలు
కేంద్రంలో ఇప్పుడు టిడిపి కీలక భాగస్వామి. దీంతో చంద్రబాబు( CM Chandrababu) ఈ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12,500 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,400 కోట్లు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. విశాఖ కేంద్రంగా సౌత్ కొస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు అయింది. వీటితోపాటు రూ.72,000 కోట్ల హైవే ప్రాజెక్టులు, రూ.70 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.2245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల రైల్వే లైన్ మంజూరు అయ్యింది.
* మిగతా చాలా పథకాలు..
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల( gas cylinder ) పథకానికి సంబంధించి దీపం 2 ప్రారంభించింది. మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తోంది. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేసింది. మత్స్యకారుల సేవా పథకం ద్వారా 20వేల ఆర్థిక సాయం కూడా అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2003 అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. 21 ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదాన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం మహిళలకు కల్పించనుంది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 350 రకాల సేవలను అందిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల సంక్షేమానికి సమప్రధాన్యమిస్తూ ముందుకు సాగింది కూటమి ప్రభుత్వం. మరో నాలుగేళ్లలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తామని సంకేతాలు ఇవ్వగలిగింది కూటమి. ఒకరకంగా చెప్పాలంటే ప్రజల్లో సంతృప్తి శాతం మాత్రం కనిపిస్తోంది.