EC Transfers: తెలుగుదేశం పార్టీ శ్రేణులు వద్దని చెప్పినా చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. వారికి బలం లేకున్నా పది అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలను కట్టబెట్టారు. దీంతో అందరూ చంద్రబాబు ఇలా చేస్తున్నారేంటి అని ప్రశ్నించినంత పని చేశారు. కానీ దాని ఫలితాలు ఇప్పుడు చంద్రబాబు అనుభవించగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, ఎలక్షన్ కమిషన్ సాయాన్ని పొందుతున్నారు. జగన్ అనుకూల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సాగనంపగలుగుతున్నారు. గత ఎన్నికలకు ముందు తనపై చేసిన ప్రయోగాలని ఇప్పుడు చంద్రబాబు తిప్పి కొడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఓ ఐదారుగురు ఐఏఎస్ అధికారులను అప్రధాన్యత పోస్టులకు పంపించారు. ఇప్పుడు మరో ఇద్దరు కీలక అధికారులను లూప్ లైన్స్ లోకి పంపించగలిగారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సాయంతోనే చేయగలిగారనడం బహిరంగ రహస్యం.
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వారిని వెంటనే రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీరిద్దరిని ఎన్నికలకు సంబంధంలేని విధుల్లో నియమించాలని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి లపై సైతం వేటు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల ముందు ఎన్ డి ఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. ప్రధాని మోదీని విభేదించారు. అప్పట్లో రాష్ట్ర డిజిపి, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, ఇంటలిజెన్స్ చీఫ్.. ఇలా వరుసగా అధికారులపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది.
సాధారణంగా ఎన్నికలు అన్నాక.. ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ సహకారం చాలా అవసరం. ప్రస్తుతం ఈసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పని చేస్తుందన్నది బహిరంగ రహస్యం. వ్యవస్థలపరంగా ఈసీ సాయం కావాలంటే కేంద్రం సాయం తప్పనిసరి. అందుకే చంద్రబాబు బిజెపి బలానికి మించి ఏపీలో సీట్లు కేటాయించారు. అలాగే విభజిత రాష్ట్రం గా రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సాయం అత్యంత కీలకం. ఎన్నికలకు ముందు వ్యవస్థల పరంగా సాయం, అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వపరంగా సాయం కావాలంటే బీజేపీ అవసరం తప్పనిసరి. అందుకే చంద్రబాబు గత నాలుగు సంవత్సరాలుగా బిజెపి కోసం చేయని ప్రయత్నం లేదు. అతి కష్టం మీద పొత్తు కుదుర్చుకున్నారు. దానికి తగ్గట్టుగా ఎన్నికలు నిర్వహణపరంగా ఇప్పుడు సాయం పొందుతున్నారు. అందులో భాగంగానే ఏపీలో కీలక అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు.