Andhra Pradesh Heatwave: ఏపీలో ( Andhra Pradesh)పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఎండ తీవ్రత పెరుగుతోంది. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు పనిపై బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. అయితే ఎండల తీవ్రత ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మున్ముందు మాత్రం ఎండల తీవ్రత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కానీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితి మొదటికి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా ఉంది పరిస్థితి. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే సర్వసాధారణంగా మారింది. చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది కామన్ పాయింట్ గా మారింది. ప్రధానంగా రాయలసీమలో ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉంది.
* ఎండలతోపాటు వడగాల్పులు..
తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. వేడి గాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాయలసీమపై ఉష్ణోగ్రత పంజా విసిరుతోంది. దాదాపు వారిని ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటేస్తోంది ఉష్ణోగ్రత. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ సీజన్లో రాష్ట్రంలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత ఇదే. కర్నూలు జిల్లా నగర డోనలో 43.7, నంద్యాల జిల్లా గోస్పాడు లో 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఈ పరిస్థితి ఈనెల చివరి వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.
* నేడు రాష్ట్రంలో 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయి. 28 మండలాల్లో వడగాలులు వీయనున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
* శ్రీకాకుళం జిల్లా హిరమండలం, పాతపట్నం మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, జి యమ్మ వలస, కొమరాడ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం మండలాల్లో తీవ్రవాడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది.