Annadata Sukhibhava Scheme
Annadata Sukhibhav Scheme : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఈరోజుకు ఎనిమిది నెలలు పూర్తవుతుంది. తొమ్మిదో నెలలో అడుగుపెట్టింది చంద్రబాబు సర్కార్. కానీ ఇంతవరకు సంక్షేమ పథకాలు పెద్దగా అమలు చేయలేదు. ఒక్క పింఛన్ మొత్తాన్ని పెంచి అందిస్తున్నారు. అది కూడా ప్రతినెలా వేల పింఛన్లు రద్దు అవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై గట్టిగానే తన వాదనలు వినిపిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూడా అసంతృప్తి ప్రారంభం అయింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం పథకాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ తో పాటు తల్లికి వందనం అమలు చేయాలని భావిస్తున్నారు. మే నెలలో అన్నదాత సుఖీభవ, జూన్లో తల్లికి వందనం పథకాలను అమలు చేస్తారని తెలుస్తోంది. ఈనెల 28న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ రెండు పథకాలకు కేటాయింపులు ఉంటాయని ప్రచారం నడుస్తోంది.
* సూపర్ సిక్స్ పథకాల్లో హామీ
సూపర్ సిక్స్( super six ) పథకాల్లో భాగంగా.. అన్నదాత సుఖీభవకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఒక ఖరీఫ్ దాటిపోయింది. రబీ కొనసాగుతోంది. కానీ పథకం మాత్రం అమలు చేయలేదు. గతంలో రైతు భరోసా పేరిట జగన్ సర్కార్ ఈ పథకాన్ని అందించింది. చిత్తశుద్ధిగా అమలుచేసి చూపించింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాను అన్నదాత సుఖీభవ గా మార్చింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరాన్ని దాటేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని చూస్తోంది. ప్రతి రైతుకు 20వేల రూపాయల చొప్పున.. కేంద్రం మాదిరిగా మూడుసార్లు అందించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయల నగదును మూడుసార్లు 2000 చొప్పున అందిస్తూ వస్తోంది. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 14 వేల రూపాయలను మూడు విడతలుగా అందించేందుకు కూటమి సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.
* నవరత్నాల్లో భాగంగా జగన్
అయితే జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)2019లో అధికారంలోకి వచ్చారు. నవరత్నాల పథకంలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నాటి నుంచి ఈ పథకం అమలు చేయగలిగారు. నాలుగు విడతలుగా అందించగలిగారు. అయితే ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏకంగా 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కేంద్రం అందించే 6000 రూపాయలను కలుపుకొని.. మరో 14000 అందించేందుకు సిద్ధపడుతుండడం విశేషం. అయితే అది కూడా ఏక మొత్తంగా కాకుండా.. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా మూడు విడతల్లో అందించేందుకు నిర్ణయించడం మాత్రంపై రైతులు పెదవి విరుస్తున్నారు.