Narayana Special Fund AP: ఏపీ మంత్రి నారాయణ( AP Minister Narayana ) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన విజయానికి కృషి చేసిన టిడిపి కార్యకర్తల కోసం సొంతంగా రూ.50 కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. వారి కష్టాల్లో పాలుపంచుకునేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇది నిజంగా హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే పార్టీ గెలుపునకు కృషి చేసే కార్యకర్తలకు, నాయకులకు పట్టించుకునే పరిస్థితి ఉండదు. అటువంటిది వారికోసం ఈ స్థాయిలో భారీ మొత్తాన్ని ఒక నిధిగా ఏర్పాటు చేయడం గొప్ప విషయమే. అయితే ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీని తన కంచుకోటగా మార్చుకోవాలని నారాయణ భావిస్తున్నారు. ఒకవైపు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పార్టీ శ్రేణులను సైతం ఆదుకుంటున్నారు. దీంతో నారాయణ బలమైన శక్తిగా ఎదగడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: కంచుకోటలు’గా ఆ రెండు నియోజకవర్గాలు!
అంచలంచెలుగా ఎదుగుతూ
నెల్లూరు జిల్లాకు( Nellore district) చెందిన నారాయణ విద్యాధికుడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. నారాయణ విద్యాసంస్థలకు దేశంలోనే సుపరిచితులు అయ్యారు పొంగూరు నారాయణ. 1979లో ఓ చిన్న అద్దె గదిలో నారాయణ సూసన్ సెంటర్ ప్రారంభించారు. ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ ట్యూషన్ సెంటర్ అనతికాలంలోనే వందలాదిమందికి చేరుకుంది. సంక్లిష్టమైన లెక్కలను సైతం అలవోకగా.. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించారు నారాయణ. దీంతో సుదూర ప్రాంతాల నుంచి సైతం విద్యార్థుల రాక ప్రారంభం అయింది. అటు తరువాత ఇతర సబ్జెక్టు బోధకులను సైతం ఆ ట్యూషన్ సెంటర్లో చేర్చుకున్నారు. అయితే అనతి కాలంలోనే ఆ సెంటర్ కోచింగ్ సెంటర్ గా మారింది. అక్కడ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ప్రారంభించారు. అలా నారాయణ విద్యాసంస్థలు పురుడు పోసుకున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దాదాపు 14 రాష్ట్రాల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు, 40,000 మంది సిబ్బందితో నారాయణ విద్యాసంస్థలు తమ ప్రస్థానాన్ని, ప్రభావాన్ని చాటుకుంటున్నాయి.
సేవా రంగంలో ముద్ర
విద్యారంగంలోనే కాకుండా సేవారంగంలో కూడా తనదైన ముద్ర చాటుకున్నారు పొంగూరు నారాయణ. నెల్లూరు నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. రోజుకు దాదాపు 1300 మంది నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఓరుగంటి రుక్మిణమ్మ మెమోరియల్ స్కూల్ కోసం మూడు అంతస్తుల అధునాతన భవనాన్ని నిర్మించారు నారాయణ. ఆ పాఠశాల నిర్వహణను కూడా తానే చూసుకున్నారు. అన్ని రకాల వసతులను సమకూర్చారు. వేలాది మంది పేద విద్యార్థులు ఇప్పుడు అక్కడ చదువుతున్నారు. అక్కడ అడ్మిషన్లకు కూడా విపరీతమైన గిరాకీ. నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చెందిన నగరాల సరసన చేర్చాలని నారాయణ మంచి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇందులో కొంత సక్సెస్ అయ్యారు కూడా. వాస్తవానికి 2019 ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు నారాయణ. అంతకుముందు ఎమ్మెల్సీగా చేసి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న నారాయణ నెల్లూరు నగరాన్ని చక్కగానే అభివృద్ధి చేశారు. కానీ అప్పట్లో జగన్ ప్రభంజనంలో కొద్దిపాటి ఓట్లతోనే ఓడిపోయారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం కార్యకర్తలు కసిగా పనిచేయడంతో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయడం విశేషం.
Also Read: చంద్రబాబు ఆపడు.. ట్రోలర్స్ వదలరు..
తొలుత సర్వే సేవలతో..
తొలుత టిడిపి కి( Telugu Desam Party ) అంతర్గతంగా సేవలందిస్తూ వచ్చారు నారాయణ. తొలినాళ్లలో టిడిపి సర్వే విభాగానికి సేవలందించారు. 2004, 2009 ఎన్నికల్లో గట్టిగానే కృషి చేశారు. టిడిపి ప్రతిపక్షానికి పరిమితం అయిన తెరవెనుక సేవలను మాత్రం కొనసాగించారు. చంద్రబాబు నారాయణ సేవలను గుర్తించి 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. మంత్రి పదవి ఇచ్చారు. మరోవైపు అమరావతి రాజధాని బాధ్యతలను అప్పగించారు. 2019లో ఓడిపోయినా.. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురైనా నారాయణ మాత్రం తెలుగుదేశం పార్టీని వీడలేదు. అదే కసితో పని చేశారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి బాధ్యతలు చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. తాను నియోజకవర్గానికి దూరంగా ఉన్నా.. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల కోసం ఏకంగా 50 కోట్ల నిధిని ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఇతర నేతలకు ఆదర్శం కూడా.