AP Elections 2024: ఏపీలో అత్యధిక ఓటింగ్ ఎవరికి చేటు

గ్రామీణ ప్రాంతాల్లో వైసిపి, అర్బన్ ప్రాంతాల్లో టిడిపి కూటమి మెజారిటీ సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వచ్చాయి. కానీ పోలింగ్కు కొద్ది గంటల ముందు ఓటమికి పాజిటివ్ వాతావరణం కనిపించింది.

Written By: Dharma, Updated On : May 14, 2024 11:41 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తింది. ఉదయం పోలింగ్ కేంద్రాలు తెరిచే సమయానికి పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. గంటల తరబడి ఓపికగా నిరీక్షించారు. రాత్రి 10 గంటల వరకు కూడా అనేక చోట్ల క్యూ కట్టారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే వలస ఓటర్లు కూడా వచ్చారు. ఓటింగ్ దాదాపు 80% వరకు వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే పెరిగిన ఓటింగ్ దేనికి సంకేతం? గెలిచేదెవరు? నిలిచేదెవరు? అన్న బలమైన చర్చ ప్రారంభమైంది. సంక్షేమ పథకాలు నచ్చి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారని అధికారపక్షం.. ఈ ప్రభుత్వాన్ని దించాలన్న కసితో ఓటర్లు పోటెత్తారని విపక్షం చెబుతోంది. అయితే విపక్ష కూటమిలో ఉన్న ధీమా.. అధికారపక్షంలో కనబడడం లేదు.

అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైసిపి, అర్బన్ ప్రాంతాల్లో టిడిపి కూటమి మెజారిటీ సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వచ్చాయి. కానీ పోలింగ్కు కొద్ది గంటల ముందు ఓటమికి పాజిటివ్ వాతావరణం కనిపించింది.ఎన్నికల నిర్వహణ, డబ్బు పంపిణీ, మద్యం సరఫరా వంటి విషయాల్లో.. అధికార పక్షానికి దీటుగా విపక్షాలు పంపకాలు చేశాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ స్థాయిలో ఓటింగ్ జరిగిందంటే అది తప్పకుండా ప్రభుత్వానికి ప్రమాదమేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళి ఎన్డీఏ పక్షాలకు అనుకూలంగా ఉందని వస్తున్న వార్తలతో టిడిపి శిబిరంలో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి.

సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసిపి బలంగా నమ్మింది. అటు ఎన్నికల ముందు సర్వేల్లో సైతం అనుకూలత రావడంతో సంబరపడింది. కానీ సంక్షేమ పథకాలు అందుకున్న వారు నోరు మెదపలేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా.. బయటకు వ్యక్తపరచలేదు. దీంతో అధికార పార్టీ అంతా పాజిటివ్ కోణంలో చూసింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, నిరుద్యోగుల్లో అసంతృప్తి, ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఆగ్రహం, వ్యాపార వర్గాల్లో నిర్లిప్తతవంటి అంశాలు ప్రతికూలత చూపాయి. విపక్ష కూటమి విజయానికి కారణం కానున్నాయి. ముఖ్యంగా బిజెపి అగ్రనేతల సాయం కూటమికి అక్కరకు వచ్చింది. వారు ఏపీకి వచ్చి పెద్ద స్థాయిలో విమర్శలు చేయడం కూడా కలిసి వచ్చింది. అయితే ప్రజలు సైలెంట్ గా ఓటు వేశారని.. తమపై సానుకూలత చూపారని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.