Super Six Super Hit: రాయలసీమలో( Rayalaseema) కూటమి సౌండ్ చేయనుంది. సమర శంఖారావం పూరించనుంది. తమది విజయవంతమైన ప్రభుత్వమని.. సూపర్ కాంబినేషన్ అని తెలియజేప్పే ప్రయత్నం చేయనుంది. 2029 ఎన్నికల్లో సైతం కలిసి నడుస్తామని చాటి చెప్పనుంది. వైసీపీకి అధికారంలోకి రానివ్వమని తేల్చి చెప్పనుంది. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తవుతున్న క్రమంలో ‘ సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ పేరిట భారీ కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురంలో నిర్వహిస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమం కూడా ఇదే. గత 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ సభను ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, మూడు పార్టీల ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ప్రతి ఒక్కరూ కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రాయలసీమ వ్యాప్తంగా భారీగా కూటమి పార్టీల శ్రేణులు తరలి వస్తాయని అంచనా వేస్తున్నారు. దాదాపు మూడు లక్షల మంది ప్రజలు వస్తారని నిర్ధారిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
* అదే ఊపుతో..
ఇప్పటికే కడప( Kadapa ) జిల్లాలో రెండు జడ్పిటిసి స్థానాలను కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. పులివెందుల జడ్పిటిసి స్థానాన్ని సొంతం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలవరపాటుకు గురిచేసింది. అంతకుముందే కడపలో మహానాడు నిర్వహించి సత్తా చాటింది టిడిపి. అయితే ఇప్పుడు కూటమిపరంగా రాయలసీమలో తమ బలం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఎక్కువ. అక్కడ బీసీ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. అక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించిన సక్సెస్ అవుతుంటాయి. అందుకే ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్ ‘సభను అక్కడే ఏర్పాటు చేశారు.
* భారీ బహిరంగ సభకు మూడు లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్నారు.
* జనాల తరలింపు కోసం ఆర్టీసీ, ప్రైవేటు కలిపి 3857 బస్సులను కేటాయించారు.
* మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, భరత్, నారాయణ, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, అచెనాయుడు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
* భద్రతా ఏర్పాట్లను డిజిపి హరీష్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 6000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
* భారీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్ళించారు. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలు వడియం పేట వద్ద.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఎంఎస్ గేటు వద్ద నుంచి మళ్ళించారు.
* శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం సభా ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ను సిద్ధం చేశారు.
* సభ కోసం 400 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు. మరో 250 కెమెరాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.
* సభా ప్రాంగణం, వేదిక, హెలీ ప్యాడ్, ప్రముఖులు పర్యటించే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, డైవర్షన్ పాయింట్స్, సభకు వచ్చి వెళ్లే మార్గాలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.