Minister aanam ramanarayanareddy : సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి అలిగారా? అందుకే మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదా? ఇష్టమైన శాఖ ఇవ్వలేదని అసంతృప్తి చెందారా? అందుకే రెండు నెలల తరువాత ఇప్పుడు మంత్రి బాధ్యతలు తీసుకున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో కలిపి 24 మంది మంత్రులు పదవి ప్రమాణస్వీకారం చేశారు. అటు తరువాత కొద్ది రోజులకే ఒక్కొక్కరుగా ముహూర్తం చూసుకొని బాధ్యతలు స్వీకరించారు. అయితే సుమారు రెండు నెలల అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించడం విశేషం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచారు ఆనం రామనారాయణరెడ్డి. సీనియర్ కావడంతో మంచి శాఖను కోరుకున్నారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలో ఏదో ఒకటి లభిస్తుందని భావించారు. కానీ చంద్రబాబు మాత్రం దేవాదాయ శాఖను అప్పగించారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే గత రెండు నెలలుగా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండేవారు. కానీ రెండు నెలల అనంతరం బాధ్యతలు స్వీకరించడంతో చర్చకు దారి తీసింది. కోరిన శాఖ లభించకపోవడం వల్లే ఆయన బాధ్యతలు స్వీకరించలేదని ప్రచారం జరిగింది. కానీ ఆయన అనుచరులు మాత్రం అటువంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డికి సెంటిమెంట్ ఎక్కువ అని.. పైగా దేవాదాయ శాఖ కావడంతో.. శ్రావణమాసంలో బాధ్యతలు స్వీకరిస్తే మంచిదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* సుదీర్ఘ నేపథ్యం
ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నాయకుడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు. జగన్ పిలుపుతో వైసీపీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఆశించినంతగా గౌరవం దక్కలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారు. కానీ మంత్రి పదవి ఇవ్వకుండా జగన్ అవమానించారు. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన రామ్ నారాయణ రెడ్డి బాటంగానే అప్పటి వైసిపి సర్కార్ తీరును తప్పు పట్టారు. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేశారని కారణం చూపుతూ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్నికలకు ముందే ఆయన టిడిపిలో చేరారు. ఆత్మకూరు టికెట్ ను దక్కించుకున్నారు. మంత్రి పదవి సైతం సొంతం చేసుకున్నారు.
* ఆశావాహులు అధికం
వాస్తవానికి నెల్లూరులో ఆశావాహులు అధికం. ఆ జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. కష్టకాలంలో సైతం పార్టీని వీడలేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం మంత్రి పదవి కోసమే పార్టీ మారినట్లు ప్రచారం జరిగింది. ఆయనకు సైతం ఛాన్స్ దక్కలేదు. సీనియర్ నేత వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరికతోనే ఆ పార్టీకి బలం పెరిగిందని.. ఆయన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. ఆమె సైతం చాన్స్ ఇవ్వలేదు. అనూహ్యంగా ఆనం రామనారాయణ రెడ్డికి ఆ పదవి ఇచ్చారు.
* సెంటిమెంట్ తోనే?
అయితే రెండు నెలల పాటు ఆలస్యంగా మంత్రి పదవి స్వీకరించడం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి అలక వహించారని.. కీలక శాఖ కేటాయించాలని చంద్రబాబు వద్ద పట్టుపట్టారని.. చంద్రబాబు పట్టించుకోకపోయేసరికి బాధ్యతలు స్వీకరించారని ప్రచారం సాగుతోంది. అయితే ఆనం మాత్రం అటువంటిదేమీ లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. కేవలం సెంటిమెంట్ పరంగా మంచి రోజు చూసి బాధ్యతలు స్వీకరించాలని చెబుతున్నట్లు సమాచారం.