Ys jagan security : తెలుగు రాష్ట్రాల్లో హుందా రాజకీయాలు తప్పుతున్నాయి. రాజకీయాలు కాస్త వ్యక్తిగత వైరంగా మారుతున్నాయి. ముఖ్యంగా నేతల భద్రత విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. రాజకీయ ప్రత్యర్థికి సైతం భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. వారు అడిగిన భద్రతను కల్పిస్తున్నారు. ఎటువంటి వివక్ష చూపడం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయ ప్రత్యర్థుల భద్రతను కుదిస్తున్నారు. వారు ఆందోళన పడేలా వ్యవహరిస్తున్నారు. అయితే 2014 తర్వాత మాత్రమే ఈ రాజకీయ పోకడ పెరగడం విశేషం. తమను వ్యతిరేకించే నాయకులు, పార్టీల అధినేతను టార్గెట్ చేసుకోవడం ప్రభుత్వాలు చేసే పని. దీనిని ఎవరు కాదన లేరు. 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కెసిఆర్. ప్రత్యర్థులను ఆత్మ రక్షణలో పడేసేందుకు వారికి కల్పించే భద్రతను తగ్గించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. కానీ అధికార పార్టీలు మాత్రం తాము చేసింది ఒప్పేనని సమర్థించుకుంటున్నాయి. అయితే తెలంగాణలో కెసిఆర్ తో ప్రారంభమైన ఈ సంస్కృతి ఏపీకి కూడా పాకింది. అప్పట్లో చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ కు భద్రత విషయంలో మెలిక పెట్టారు. ఆయనకు ఇచ్చే వాహనాల విషయంలోనూ కుదించారు. దీంతో జగన్ కోర్టుకు వెళ్లి భద్రత వాహనాలను తెచ్చుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది రిపీట్ అయింది. మాజీ సీఎం గా ఉన్న చంద్రబాబు భద్రతను కుదించారు. ఆయనకు కేంద్రం ఇచ్చిన బ్లాక్ క్యాట్ తప్ప.. రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇచ్చిన భద్రతను పూర్తిగా తగ్గించేశారు. ఇది వివాదాస్పదమైంది. కేంద్రం జోక్యం చేసుకుంది. హైకోర్టులో కేసులు దాఖలు కావడంతో చంద్రబాబుకు భద్రత పెంచారు.
* అమాంతం తగ్గిన భద్రత
ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో జగన్ భద్రత విషయంలో సమీక్ష జరిగింది. ఆయన నివాసముంటున్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుటుంబ సభ్యుల వరకు భారీ భద్రత కల్పించాలని.. ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపిస్తూ భద్రతను పూర్తిగా తగ్గించేశారు. ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో కనీస స్థాయికి కుదించారు.దీంతో జగన్ ఆందోళన చెందారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
* చేతులెత్తేసిన ప్రభుత్వం
అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్ కు భద్రత కల్పించే అవకాశం లేదని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కనీసం ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని.. ఆయనకు ఎలా సీఎంతో సమానంగా భద్రత కల్పిస్తామని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రశ్నిస్తున్నారు. నిబంధనల మేరకు మాత్రమే భద్రత కల్పించగలమని.. ఇప్పటికే పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా సరే జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ విషయంలో జగన్ సైతం వెనక్కి తగ్గడం లేదు. గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించాల్సిందేనని చెబుతున్నారు.
* కట్టుదిట్టమైన భద్రత
గతంలో జగన్ కు ఒక్కరికే 139 మందితో భద్రత కల్పించేవారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగుపెడితే వందలాదిమంది పోలీసులు మొహరించేవారు. జిల్లాల పర్యటనకు వెళ్తే వేలాదిమంది పోలీసులు భద్రతగా వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల భద్రత కూడా తగ్గింది. ఎటువంటి ఆర్భాటం లేదు. ఇటువంటి తరుణంలో తనకు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో కల్పించిన భద్రతకి జగన్ పట్టు పడుతున్నారు. కోర్టును కూడా ఆశ్రయించారు. మరి న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.