Anam Ramanarayana Reddy: తెలుగు రాజకీయాల్లో ఒక విచిత్రం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ( KCR)నిత్యం చంద్రబాబును విమర్శిస్తూనే ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం దీనిపై స్పందించరు. ఎటువంటి ఖండనలు ఇవ్వరు. ఎందుకంటే తాను స్పందించిన మరుక్షణం కెసిఆర్ దానిని రాజకీయంగా మలుచుకుంటారు. చంద్రబాబు ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు. మొన్నటికి మొన్న మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆయన పనితీరును ఎద్దేవా చేశారు. ఏపీకి వస్తున్న పెట్టుబడులపై స్పందిస్తూ.. వంట మనుషులతో ఒప్పందాలు అంటూ నోరు జారారు. నోరు జారడం కాదు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వెంటనే ఏపీ సమాజం నుంచి రిప్లై ఉంటుందని అంతా భావించారు. ఒక్కరంటే ఒక్క టీడీపీ నేత కూడా స్పందించలేదు. వారికి ఆదేశాలు ఉంటాయి. పైగా రెండు దశాబ్దాలుగా కెసిఆర్ చంద్రబాబును ఆడిపోసుకునే ఉంటున్నారు. ఇప్పుడు కొత్తగా కెసిఆర్ ఏం మాట్లాడుతారులే అని తేలిగ్గా తీసుకున్నారు టిడిపి నేతలు. అయితే సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం ఘాటుగా స్పందించారు. పోవయ్యా అంటూ వ్యాఖ్యానించారు. కచ్చితంగా దీనిపై తెలంగాణ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుంది.
* సంక్లిష్ట పరిస్థితుల్లో గులాబీ పార్టీ..
ప్రస్తుతం గులాబీ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అక్కడ కాంగ్రెస్ ( Congress) పార్టీ అధికారంలో ఉంది. ఆపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సైతం పట్టు కోసం ఆరాటపడుతోంది. ఈ పరిస్థితుల్లో తన పార్టీని రక్షించుకోవడం అనేది కేసీఆర్ ముందున్న కర్తవ్యం. దానికోసం ఆయన ప్రతిసారి మాదిరిగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే.. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. రెండు రాష్ట్రాల్లో పెట్టుబడుల సదస్సుపై హాట్ కామెంట్స్ చేశారు. గురువు అలా చేస్తే శిష్యుడు అంతకంటే ఏం చేయగలడు అంటూ చమత్కరించారు. వంట మనుషులతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకున్నాడు అంటూ చాలా తేలిగ్గా మాట్లాడారు. గురువు చంద్రబాబును రేవంత్ అనుసరిస్తున్నారు అంటూ తెలంగాణ పెట్టుబడుల సదస్సు పై మాట్లాడారు. అయితే దీనిపై ఏపీ నుంచి పెద్దగా కౌంటర్ వెళ్లలేదు.
* సెంటిమెంట్ కోసమే..
ప్రస్తుతం తెలంగాణ సెంటిమెంట్ చుట్టూ అక్కడ రాజకీయం నడుస్తోంది. దానికోసం ఏదో ఒక అంశం అక్కడ కావాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు. ఆవేదనతో దిష్టి అనే పదం వాడారు. అంబేద్కర్ కోనసీమ లాంటి ప్రాంతం తమ రాష్ట్రంలో లేదే అని చాలామంది తెలంగాణవాసులు బాధపడుతుంటారు. బహుశా అటువంటి వారి దిష్టి తగిలి ఉంటుందేమోనని సానుకూలంగానే మాట్లాడారు పవన్ కళ్యాణ్. కానీ పవన్ మాటలను ముందుగా ఖండించింది గులాబీ పార్టీ. దానిని అందుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అక్కడ సెంటిమెంట్ అనే అస్త్రం బయటకు రావాలి. అయితే ఈ విషయంలో కెసిఆర్ ముందుంటారు. రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన ఆయన చంద్రబాబును చాలా అవమానకరంగా మాట్లాడారు. కానీ ఏపీ నుంచి ఏ టిడిపి నేత కూడా దానిపై మాట్లాడలేదు. ఈరోజు సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచమే చంద్రబాబును గుర్తిస్తే.. ఈ కెసిఆర్ గుర్తించకపోవడం ఒక లెక్క.. పో పోవయ్యా అంటూ గట్టిగానే హెచ్చరించారు ఈ సీనియర్ మంత్రి. దీనిపై గులాబీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.