Anakapalli: సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రజలపై పడుతోంది. ముఖ్యంగా సినిమాల ప్రభావం సమాజాన్ని కలుషితం చేస్తోంది. సినిమాలు చూసి అఘాయిత్యాలకు పాల్పడే పరిస్థితికి వచ్చింది.సినిమాల్లో కొన్ని దృశ్యాలను చూసి అనుసరించేవారు ఉన్నారు. అంతెందుకు టీవీల్లో వచ్చే ప్రకటనలు చూసి పిల్లలు మారం చేస్తుంటారు. అయితే సినిమాల్లో చూపే మంచి కంటే చెడే అధికంగా ప్రభావం చూపుతోంది. తాజాగా ఏపీలో వెలుగు చూసిన ఓ ఘటన వెనుక సినిమా ప్రభావం ఉండడం విచారకరం. పుష్ప 2 చిత్రం చూసి వచ్చిన ఓ యువకుడు ఏకంగా ఆర్టీసీ డిపోలో ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
* డిపోలో బస్సు మాయం
అనకాపల్లి జిల్లాలో ఓ ఆర్టీసీ అద్దె బస్సు చోరీకి గురైంది. నర్సీపట్నం డిపోకు చెందిన ఈ ఆర్టీసీ బస్సురెండు రోజుల క్రితం అంటే..ఆదివారం రాత్రి మాయమైంది. దీంతో ఆర్టీసీ అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. నర్సీపట్నం నుంచి తునికి సెటిల్ సర్వీస్ నడిపే ఈ అద్దె బస్సు.. డిపోలో పార్క్ చేశారు. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు బస్సు తీసేందుకు డ్రైవర్ అక్కడకు వెళ్ళగా కనిపించలేదు. కంగారు పడిన బస్సు డ్రైవర్ వెంటనే డిపో మేనేజర్ తో పాటు బస్సు యజమానికి సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
* తమిళనాడు కు చెందిన వ్యక్తి నిందితుడు
అయితే బస్సు అదృశ్యంతో పోలీసులు సవాల్ గా తీసుకొని రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నర్సీపట్నం నుంచి అల్లూరి జిల్లా చింతపల్లి వెళ్లే రూట్ లో బస్సును కనుగొన్నారు. తమిళనాడుకు చెందిన సాదిక్ పుష్ప 2 చిత్రం చూసి బస్టాండ్ లో పడుకున్నాడట. బస్సుకు తాళం ఉండడంతో.. బస్సుతో పరారైనట్లు పోలీస్ విచారణలో తేలింది. అయితే ఒక్క సాదిక్ మాత్రమే ఉన్నాడా.. ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పుష్ప 2 చిత్రంతో ప్రేరణ పొంది బస్సు చోరీకి పాల్పడినట్లు నిందితుడు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.