Amit Shah
Amit Shah: ఏపీ విషయంలో బిజెపి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తెర వెనుక జగన్ తో సంబంధాలు నడుపుతున్నారని.. టిడిపితో పొత్తు బిజెపి అగ్ర నేతలకు ఇష్టం లేదని.. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి వారు అంగీకరించడం లేదని లేనిపోని ప్రచారం జరిగింది. రాజ్యసభలో వైసిపి అవసరం ఉన్న దృష్ట్యా బిజెపి ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి.బిజెపి అగ్రనేతలు ప్రచారానికి కూడా రావడంలేదని.. కనీసం ఉమ్మడి మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపలేదని లేనిపోని ప్రచారం చేశారు. కానీ అదంతా తప్పు అని తేల్చి చెప్పారు బిజెపి అగ్రనేత అమిత్ షా. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా కీలక విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
కేంద్రంలో ప్రధానిగా మోదీ, ఏపీలో సీఎంగా చంద్రబాబు వస్తేనే అభివృద్ధి అనేది సాధ్యమని తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు పాలనలో ఏపీ నెంబర్ వన్ గా నిలిచిందని కితాబిచ్చారు. జగన్ ప్రభుత్వం పై అటాక్ చేశారు. భ్రష్టాచార్ సర్కార్ అంటూ ఇచ్చి పడేశారు. అవినీతి, గుండాయిజంతో కూడుకున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టడానికి తా ము టిడిపి, జనసేనతో జత కట్టినట్లు తేల్చి చెప్పారు. రామాలయం ప్రారంభోత్సవానికి పిలిస్తే జగన్ రాకపోవడాన్ని తప్పు పట్టారు. ఆయనకు రామభక్తులు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను జగన్ సర్కార్ మంటగల్పుతోందని ఆరోపించారు. ఏపీలో అమరావతి రాజధానికి బిజెపి కట్టుబడి ఉందని కూడా తేల్చి చెప్పారు. అటు పోలవరం సైతం జగన్ పాలనలో పడకేసిందని విమర్శించారు.
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని అమిత్ షా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. టిడిపి కూటమికి ఇంజన్ బిజెపి అయినా.. ఏపీకి సారధి మాత్రం చంద్రబాబు అని తేల్చి చెప్పారు. అయితే బిజెపి అగ్రనేతల వైఖరి వేరేలా ఉందని ఇంతవరకు ప్రచారం జరిగింది. కానీ తమ భాగస్వామ్యంలోని ప్రభుత్వం ఏపీలో రావాలని బిజెపి అగ్ర నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో.. చివరి రోజుల్లో ఏపీ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలని బిజెపి అగ్ర నేతలు భావించినట్లు సమాచారం. అమిత్ షా కీలక వ్యాఖ్యల నేపథ్యంలో.. రేపటి ప్రధాని పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన సైతం జగన్ విషయంలో ఏపీ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే అమిత్ షా, ప్రధాని మోదీ విమర్శలపై వైసీపీ ఎటువంటి స్పందనకు దిగుతుందో చూడాలి.