Amit Shah Vs YS Jagan : ఏపీలో ముసుగు వీడుతోంది. స్నేహం స్నేహమే.. రాజకీయం రాజకీయమే అని బీజేపీ డిసైడయి నట్టుంది. జగన్ సర్కారుపై యుద్ధం ప్రకటించింది. మొన్న శ్రీకాళహస్తిలో జాతీయ అధ్యక్షుడు నడ్డా, నిన్న విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ వైఖరిపై విరుచుకుపడ్డారు. కేంద్ర పెద్దలు వైఖరి మారినట్టు స్పష్టంగా కనిపించడంతో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. మొన్నటివరకూ అగ్రనేతల దీవెనలతో జగన్ అనుకున్నది సాధిస్తున్నారంటూ ప్రశంసలు వెలువడ్డాయి. కానీ అది బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా ఆడుతున్న ఆట అని తేలిపోయింది.
అయితే అమిత్ షా రాష్ట్రానికి వచ్చి మరీ జగన్ పై ఫైర్ కావడానికి అనేక కారణాలున్నాయి. సహజంగానే ఇది టీడీపీకి ఆనందం కలిగించే విషయం. మొన్నటికి మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. పొత్తు ప్రతిపాదనలు పెట్టారు. కానీ బీజేపీ నుంచి అనుకున్నంత సానుకూలత రాలేదని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు అమిత్ షా వచ్చి జగన్ మీద గన్ ఎక్కుపెట్టారు. ఓ లెక్కన ఫైర్ అయ్యారు. ఏపీలో జగన్ పాలన అవినీతిమయం అంటూ నిప్పులు చెరిగారు. నాలుగేళ్ల కాలంలో ఏమి సాధించారు అని నిలదీశారు.ఎటు చూసిన అక్రమాలే తప్ప ఏముంది మీ పాలన అంటూ జగన్ సూటిగా ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ఏపీ మూడో స్థానంలో ఉందంటే సిగ్గుపడాలని అమిత్ షా అన్నారు.కేంద్రం ఇచ్చే పథకాల మీద జగన్ ఫోటో ఎందుకు అని నిగ్గదీశారు. అంతే కాదు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తే అవి ఏమయ్యాయో చెప్పాలని జగన్ కి ఆయన పెద్ద ప్రశ్న వేశారు.
వచ్చే ఎన్నికల్లో 300 ఎంపీ స్థానాలను గెలవనున్నట్టు అమిత్ షా ప్రకటించారు. ఏపీలో 25కి 25 ఎంపీ స్థానాలను తమకు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ చిత్తశుద్ధితో కృషిచేస్తుందని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ ఏలుబడిలో మాత్రం ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. అందుకే 2024 ఎన్నికల్లో కూడా మోదీనే గెలిపించాలన్నరు. ఈసారి 300 పైగా ఎంపీ స్థానాల్లో మళ్లీ విజయం సాధిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. ఎక్కడా పొత్తుల గురించి కానీ మిత్రుల గురించి కానీ మాట్లాడకుండా ఏపీలో సోలోగా బీజేపీని గెలిపించమని అమిత్ షా కోరడమే గమనార్హం.
అయితే ఏపీలో బీజేపీకి పాజిటివ్ ఓటు బ్యాంకు ఉందా? అంటే అదీ లేదు. ప్రతి సార్వత్రిక ఎన్నికలకు ఓటు షేరింగ్ తగ్గుతూ వస్తోంది. ఇటువంటి సమయంలో అమిత్ షా బీజేపీ బలంపై మాట్లాడడం రకరకాల చర్చలకు దారితీస్తోంది. పొత్తులపై స్పష్టతనిచ్చినట్టయ్యిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా ఇక సమరానికి తెరతీశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమిత్ షా తాజా ఆరోపణలతో ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.